ఆర్టీసీలో భారీగా భత్యాల పెంపు
- కొత్త అలవెన్సులు ఖరారు చేసిన జేఎండీ
- సంస్థపై అదనపు భారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధికారులకు యాజమాన్యం వివిధ రకాల భత్యాల(అలవెన్సులు)ను ఖరారు చేసింది. తాజా వేతన సవరణ నేపథ్యంలో భారీగా పెరిగిన జీతాలకు తోడుగా ఇప్పుడు భత్యాలు కూడా భారీగానే పెరిగాయి. 100 శాతం పెంచాలనే డిమాండ్ వచ్చినప్పటికీ సంస్థ ఆర్థిక స్థితి దృష్ట్యా జేఎండీ రమణరావు రెట్టింపు కాకుండా స్వల్పంగా తగ్గించి ఖరారు చేశారు. సూపర్ స్కేల్, స్పెషల్ స్కేల్, సీనియర్ స్కేల్, జూనియర్ స్కేల్ అధికారులకు సంబంధించిన భత్యాలను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి సూపరింటెండెంట్ స్థాయి అధికారుల భత్యాలు ఖరారు చేయాల్సి ఉంది.
గతంతో పోలిస్తే వాటిని 60 శాతం వరకు పెంచే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. టీఏడీఏ, స్పెషల్ అలవెన్సు, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ అలవెన్సు, న్యూస్‌పేపర్ అలవెన్సు, రీఫ్రెష్‌మెంట్ రీయింబర్స్‌మెంట్, కన్వేయన్స్ రీయింబర్స్‌మెంట్ తదితరాల్లో భారీ పెరుగుదల నమోదైంది. వేతన సవరణతో వీటినీ పెంచాల్సిన అగత్యం ఏర్పడింది. ఇటీవలి వేతన సవరణతో సంస్థపై ప్రతినెలా రూ.75 కోట్ల వరకు అదనపు భారం పడుతుండటంతో ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం చేస్తే తప్ప వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భత్యాల భారాన్ని మోసేందుకు సంస్థ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.
ప్రతి నెలా చెల్లించే భత్యాల పెంపు ఇలా...
టీఏడీఏ: సూపర్ స్కేల్ అధికారులకు రూ.1,200 నుంచి 1,920కి, స్పెషల్ స్కేల్లో రూ.వేయి నుంచి 1,600కు, సీనియర్ స్కేల్లో 800 నుంచి రూ.1,280కి, జూనియర్ స్కేల్ అధికారులకు 600 నుంచి రూ.960కి పెంచారు.
స్పెషల్ అలవెన్సు: 80 కంటే ఎక్కువ బస్సులున్న డిపో మేనేజర్లకు రూ.6,400, అంతకంటే తక్కువున్న డీఎంలకు రూ.4,800గా నిర్ధారించారు.
ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ అలవెన్సు: సూపర్ స్కేల్ అధికారులకు రూ.2,500 నుంచి 4 వేలకు, సీనియర్, జూనియర్ స్కేల్ అధికారులకు రూ.2 వేల నుంచి 3,200కు పెంచారు.
న్యూస్‌పేపర్ అలవెన్సు: సూపర్ స్కేల్ అధికారులకు రూ.1,500 నుంచి 2,400కు, స్పెషల్ స్కేల్ అధికారులకు రూ.1,200 నుంచి 1,920కి, సీనియర్ స్కేల్లో రూ.వేయి నుంచి 1,600కు, జూనియర్ స్కేల్లో 700 నుంచి రూ.1,120కి పెంచారు.
రిఫ్రెష్‌మెంట్ రీయింబర్స్‌మెంట్: సూపర్ స్కేల్లో రూ.2,500 నుంచి 4 వేలకు, స్పెషల్ స్కేల్లో రూ.2,300 నుంచి రూ.3,680కి.
కన్వేయన్స్ రీయింబర్స్‌మెంట్: డీఎంలకు రూ.10,400కు, సీనియర్ స్కేల్లో రూ.8 వేలకు పెంచారు.
తార్నాకలోని ఆసుపత్రిలో హజార్డెడ్ విధులు నిర్వహించే వైద్యులకు అందించే ప్రత్యేక భత్యాన్ని రూ.7 వేల నుంచి 11,200కు పెంచారు. రెండేళ్లకోమారు అందించే బ్రీఫ్‌కేస్ అలవెన్సును పెండింగులో ఉంచారు.