సాక్షి, హైదరాబాద్: పేరుకు వారు భద్రతా సిబ్బంది.. కాని నిత్యం అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ అధికారి ఆగడాలకు అల్లాడిపోతున్నారు. ఆ అధికారికి మామూళ్లు ఇవ్వకుంటే బదిలీలు.. మాట్లాడితే సస్పెన్షన్.. ప్రశ్నిస్తే డిస్మిస్‌కు గురవుతున్నారు. ఇదీ ఆర్టీసీలోని భద్రతా సిబ్బంది దుస్థితి. ఆ అధికారి ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో ఉత్తర తెలంగాణకు సంబంధించి నిఘా బాధ్యతలు చూసే ఓ అధికారి రిటైర్డ్ అయి తిరిగి అదేపోస్టులో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధుల్లో చేరాడు. అతనికి సిబ్బంది నెలవారీ మామూళ్లు సమర్పించుకోవాల్సిందే.
ఇవ్వకపోతే కక్ష కట్టి ఎడాపెడా ట్రాన్స్‌ఫర్లు చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ అధికారికి మామూళ్లు ఇచ్చిన వారు ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతారు. వీరంతా బయట ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు’అని ఆరోపిస్తున్నారు. అందుకే, ఆర్టీసీలో నిఘా బాధ్యతలను పర్యవేక్షించాల్సిన కొంతమంది సిబ్బంది ఈ అధికారి అండ చూసుకుని ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. ఈ అధికారి హైదరాబాద్‌లో ఉంటూ వారంలో ఒక్కరోజు మాత్రమే విధులకు హాజరవుతారని, అత్యవసర ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉంటే హైదరాబాద్‌కే తెప్పించుకుంటారన్నారు. ఆ అధికారి సస్పెండ్ చేసిన సిబ్బంది ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, మరికొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు వాపోతున్నారు.
అతనికి అధికారాలే లేవు
వాస్తవానికి ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే వారికి కార్మికులను డిస్మిస్ చేసే అధికారాలు లేవని పలువురు సిబ్బంది వాపోతున్నారు. నిజంగా ఆ అధికారికి అధికారాలు ఉంటే... ఆర్టీసీ బోర్డు స్వయంగా అతనికి ప్రత్యేకంగా అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అతని వద్ద ఉండాలని, కాని అవి ఆయన వద్ద లేవని సిబ్బంది వాదిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా బోర్డే పూర్తిస్థాయిలో ఏర్పడలేదని, అలాంటపుడు ఇతనికి డిస్మిస్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. బోర్డుకు పూర్తిస్థాయి ఎండీ లేడన్న ధీమాతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది ఆ అధికారి వ్యవహారంపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని, ఆయనపై చర్యల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment