
సాక్షి, హైదరాబాద్: బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రగతి భవన్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించినా.. సమ్మె విరమణ ప్రతిపాదనపై మాత్రం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమించేందుకు సిద్ధమంటూ జేఏసీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రతిపాదన వచ్చిన మరుసటిరోజే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించటంతో, దీనిపై సర్కారు స్పందించే అవకాశం ఉంటుందని కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ ప్రస్తావనే లేదు. అయితే, శుక్రవారం మరోసారి సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
సర్కారు చెప్పేవరకు తీసుకోలేం..
రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేశారు.
ఈ పరిణామాలు కార్మికుల్లో ఆందోళన కలిగించడంతో ఆర్టీసీ జేఏసీ గురువారం మరోసారి సమావేశమై దీనిపై చర్చించింది. తాము సమ్మె విరమణకు సిద్ధమని ప్రకటించినందున ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ఇప్పటికే 29 మంది కార్మికులు చనిపోయినందున మానవతా దృక్ఫథంతో వారిని విధుల్లోకి చేర్చుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ, వాసుదేవరావు, థామస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం మరోసారి సమీక్ష?
ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
జేఏసీపై ఎన్‌ఎంయూ విమర్శలు
అపరిపక్వత, అహంకారం, అనుచిత వ్యాఖ్యలతో జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేశారంటూ ఎన్‌ఎంయూ తీవ్రంగా విమర్శించింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలతో 49వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తెచ్చిందని ఆ సంఘం నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురామ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, దామోదర్‌రెడ్డి తదితరులు దుయ్యబట్టారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో గురువారం కార్మికుల నిరసనలు అంతంత మాత్రంగానే సాగాయి. 48 రోజుల పాటు ఉధృతంగా సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్న కార్మికులు.. గురువారం చాలా తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. విధుల్లో చేరాలన్న ఉద్దేశంతో చాలా మంది డిపోల వద్దకు వెళ్లారు. కొంతమంది మాత్రం తిరిగి విధుల్లో చేరాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిపోల ఎదుట నిరసనలు నిర్వహించటం విశేషం.
మరోవైపు అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో బిజీగా గడిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 6,585 బస్సులు తిప్పినట్టు వెల్లడించారు. ఇందులో 4,663 ఆర్టీసీ బస్సులు కాగా, మిగతావి అద్దె బస్సులు. 4,663 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,585 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో పాల్గొన్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment