
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే వారిని విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర గవర్నర్‌గా గత సెప్టెంబర్ 8న తమిళిసై బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమెను కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి కలుసుకోవడం ఇదే తొలిసారి. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. ఆర్టీసీపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని, రాష్ట్ర రవాణా శాఖ అధికారులను ఇందుకోసం ఢిల్లీకి పిలుస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమ్మెకు దిగిన కార్మికుల పట్ల ప్రభుత్వ కఠిన వైఖరికి కారణాలు, ఆర్టీసీ సంస్థ ఆర్థిక స్థితిగతులు, 5,100 రూట్లను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వస్తే పెద్ద మనస్సుతో వారిని చేర్చుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సీఎంకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ఉద్దేశాలను ఈ భేటీలో సీఎం.. గవర్నర్‌కు తెలియజేసినట్లు తెలిసింది. త్వరలో శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నామని గవర్నర్‌కు తెలియజేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment