సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బందితో బస్సులు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి దాఖలు చేసిన పిల్‌ను సోమవారం ధర్మాసనం విచారించింది.
వోల్వో ప్రైవేటు బస్సులు, ట్రక్కులు నడిపే వాళ్లను తాత్కాలిక ప్రాతిపదికపై నియమించడం వల్ల అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని గోపాలకృష్ణ వాదించారు. ప్రమాదాల వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీ యాజమాన్యం పరిహారం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని, గాయపడిన వారికి ఆర్థికసాయం అందజేయాలని కోరారు. ప్రైవేటు వాహనాల బ్రేక్ సిస్టమ్ ఎయిర్ వాక్యూమ్ మీద ఆధారపడి ఉంటుందని, అయితే ఆర్టీసీ బస్సులు హైడ్రాలిక్–కమ్–ఎయిర్ బ్రేక్ పద్ధతుల్లో పనిచేస్తాయని, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ వంటి సాంకేతిక విషయాలపై ప్రైవేటు డ్రైవర్లకు అవగాహన ఉండదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 90 రోజుల శిక్షణ తర్వాతే విధుల్లోకి తీసుకోవాలన్నారు.
మోటారు వాహన చట్టంలోని 19వ సెక్షన్ ప్రకారం కండక్టర్‌గా చేసే వారికి సర్టిఫికెట్ ఉండాలని, అయితే పదోతరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డు ఉన్న వాళ్లను నియమిం చారని చెప్పారు. సమ్మె నేపథ్యంలో కేవలం సీఎం కేసీఆర్ మెప్పు కోసమే అధికారులు ఈ తరహా నియామకాలు చేశారని చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
జీతాల చెల్లింపు కేసు రేపటికి వాయిదా
ఆర్టీసీ సిబ్బంది పనిచేసిన సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు దాఖలు చేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి మరోసారి విచారించారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫు వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోరారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా కోరారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. ఇకపై వాయిదాలు కోరవద్దని సూచించిన హైకోర్టు, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment