హామీలు అమలు చేయండి
- నేటి సమావేశంలో ప్రధాని మోదీని కోరనున్న కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: మూడురోజు ల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం తుగ్లక్‌రోడ్డులోని తన నివాసంలో విశ్రాం తి తీసుకున్నారు. పార్టీ ఎంపీ లు, ప్రభుత్వ ప్రతినిధులతో కాసేపు సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత ఆదివారం ఢిల్లీలో జరిగే సీఎంల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర సమస్యలను, కేంద్ర ఇచ్చిన హామీల అమలును ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విద్యుత్ మంత్రి పీయూష్‌గోయల్, జలవనరుల మంత్రి ఉమాభారతితో ఆయన భేటీ అవుతారని తెలిసినా, ఎవరినీ కలవలేదు. ఆదివారంనాటి సమావేశంలో ప్లానింగ్ కమిషన్ గురించి కేసీఆర్ మాట్లాడుతారని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలన్న అంశంపై చర్చిస్తారని తెలిసింది.
సోమవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రులతో కేసీఆర్ సమావేశమవుతారని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియాకు తెలిపారు. ‘ప్లానింగ్ కమిషన్ అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మాట్లాడతారు.
ఆయా రాష్ట్రాల సమస్యలపై సీఎంలతో విడివిడిగానూ మాట్లాడతారు’ అని వారు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా ప్రధాని మోదీ కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారన్న నమ్మకం ఉందన్నారు.