మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ పరిధిలోని మొదటిజోన్ కు ఆగస్టు 10వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నీటిని విడుదల చేసేందుకు ఎన్‌ఎస్‌పీ అధికారులు ప్రణాళిక రూపొం దించారు. ఖరీఫ్ సాగుకు గాను ఈ నీటివిడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఉంటుంది.
విడతల వారీ నీటి విడుదల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్‌ఎస్‌పీ అధికారులు క్షేత్ర పర్యటన నిర్వహించి, ఆపై నీటివిడుదల కొనసాగించనున్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పీ కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, అధికారులతో సీఈ యల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటివిడుదలపై వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘మననీరు-మన ప్రణాళిక’ అనే లక్ష్యంతో సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు రైతులతో ఈ అవగాహన సదస్సు నిర్వహించినట్లు యల్లారెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలో 3,04,000 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 16,000 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలోకి ఇప్పటి వరకు 125 టీఎంసీల వరదనీరు చేరిందన్నారు. ఎగువ కృష్ణా నుంచి వచ్చే వరదను అంచనా వేసి రెండోజోన్‌కు నీటి విడుదలపై మరో 10రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ రైతులు సాగునీటి తీరువాను ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. మెయిన్ కెనాల్, మేజర్ల కాల్వలు, తూములను రైతులు ఎవరైనా స్వార్థం కోసం ధ్వంసం చేస్తే చట్టరీత్యా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదవుతాయన్నారు. సమావేశంలో ఎన్‌ఎస్‌ఫీ ఎస్‌ఈ సుధాకర్, డిప్యూటీ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎడమకాల్వ నీటిసంఘం మాజీ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి,ఈఈ రత్తయ్య, ఏఓ జయప్రద ఉన్నారు.
ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో సాగర్ నీటివిడుదల
Published Sat, Aug 9 2014 3:15 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement