సగర లను బీసీ ‘ఏ’లో చేరుస్తాం
శంఖారావం సభలో ఈటెల ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తామని హామీ ప్రమాద బీమా రూ.5 లక్షలకు పెంచుతాం: నాయిని
హైదరాబాద్: సగర(ఉప్పర) కులస్తులను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లో చేర్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సగరలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సగరలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన సగర శంఖారావం బహిరంగ సభకు మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు కులవృత్తులకు, సగరలకు కేటాయించిన నిధులను వేరే పథకాలకు మళ్లించాయని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రుణాలను మంజూరు చేయడంలో సాధ్యం కాని షరతులను పెట్టడం వల్ల చాలా మంది రుణాలు పొందలేకపోయారని చెప్పారు.
తమ ప్రభుత్వం సగరల సమస్యల పరిష్కారానికి అన్నివిధాలుగా కృషి చేస్తుందన్నారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో సగర కులస్తులు ముందుండి పోరాడారని కొనియాడారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం జరిగితే బీమా రూపంలో ఇచ్చే రూ. 2 లక్షలను రూ. 5 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సగరలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన సగరల అభివృద్ధికి అసెంబ్లీలో పోరాడతానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సగర (ఉప్పర) సంఘం అధ్యక్షులు బంగారి నర్సింహాసాగర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సగరల కులవృత్తిని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పు తయారు చేసిన ఉప్పరులు కాలక్రమేణాభవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారన్నారు. వలస కూలీలుగా దేశ సంచారం చేస్తున్న సగరల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయడంలేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బీసీ ‘ఏ’లో చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదన్నారు. దేశంలో అనేక భవనాలను నిర్మించినా.. ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేకపోవడంతో సగరలు వెనుకబడి ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సగర కులస్తులను గుర్తించి ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ ‘ఏ’లో చేర్చడంతో పాటు ఈఎండీ లేకుండా ప్రభుత్వ నిర్మాణ పనుల టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సగర (ఉప్పర) కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ద్వారా తమ సంఘాలకు 50 శాతం సబ్సిడీతో నిర్మాణ పనిముట్లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.10 నుంచి రూ. 5 కోట్ల వరకు రుణాలు మంజూరుచేయాలన్నారు. సగరలను అధికారికంగా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి రూ.10 లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ భవన నిర్మాణ సంఘ బోర్డు చైర్మన్‌గా సగరలను నియమించాలన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సీతారాములు, జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రావ్‌సాగర్, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షులు ఎస్. హనుమంతు సాగర్, కోశాధికారి కె. రాములు సాగర్, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి హరీశ్‌సాగర్, తెలంగాణ రాష్ట్ర సగర మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కుసుమసాగర్, సువర్ణసాగర్ తదితరులు పాల్గొన్నారు.