BC a
-
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
TS: బీసీలకు ఆర్థిక సాయం.. గడువు ముగుస్తోంది.. దరఖాస్తు ఎలా?
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన కులవృత్తుల కుటుంబాల్లో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని తలపెట్టారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, నివాస, ఆహార భద్రత తదితర ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్ లోడ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు విధించడంతో అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ► గడచిన వారం రోజులుగా ఖైరతాబాద్, షేక్‌పేట మండల కార్యాలయాలకు బీసీ కులవృత్తుల అర్హులు ధ్రువపత్రాల కోసం బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం కింద సుమారు లక్ష మంది అర్హులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ధ్రువీకరణ పత్రం మంజూరయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుండటంతో లబి్ధదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ►దరఖాస్తు చేసుకునేందుకు ఆహార భద్రతా కార్డులు తప్పనిసరి చేయడంతో నాలుగేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు కానివారంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇలా నష్టపోతున్నవారిలో సుమారు 50 వేల మంది వరకు అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ► దీనికి తోడు సర్వర్ డౌన్ మరింత తీవ్ర సమస్యగా మారింది. అసలే గడువు సమీపిస్తున్నదని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా మూడు రోజులుగా సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీని వల్ల మండల కార్యాలయాల్లో పత్రాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. దళారులను ఆశ్రయిస్తున్న వైనం... ►నిబంధనల ప్రకారం నూతన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచాలని సూచించడం, గడువు తేదీ సమీపిస్తుండటంతో చాలా మంది లబ్ధిదారులు వీటిని పొందేందుకు పక్కదారులు చూస్తున్నట్లు సమాచారం అందుతున్నది. ► దరఖాస్తుదారుల స్థోమతను బట్టి కొంత మంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మీసేవా కేంద్రాల్లో ఈ పత్రాలు అప్లోడ్ చేసేందుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు. ► లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మీ సేవా కేంద్రాలు అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఎలాంటి నిఘా లేకపోవడంతో సమస్య రోజురోజుకు జఠిలమవుతూ లబి్ధదారులు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది. గడువు పెంచాలి:నాయీ బ్రాహ్మణ సేవాసంఘం రహమత్‌నగర్: బీసీ చేతి వృత్తులవారికి ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు గడువును పెంచాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయీ మాట్లాడుతూ... దరఖాస్తు చేసేందుకు ఈ నెల 20వ తేదీన ఆఖరి కావడంతో కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం చేతి వృత్తుల వారు తహసీల్దార్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారన్నారు. విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కులవృత్తుల వారు దరఖాస్తుల చేస్తుండటంతో మీ సేవ సర్వర్ పనిచేయక జాప్యం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు నిరుపేదలు చాలా మందికి రేషన్ కార్డులేక పోవడంతో ఆర్థిక సాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించి, రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన మినహాయించాలని ఆయన కోరారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సత్యనారాయణ, రహమత్‌నగర్ సత్యనారాయణ, కృష్ణానగర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలి
తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జగన్మోహన్రావు తూప్రాన్: ముదిరాజ్ కులస్తులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏలోకి మార్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముదిరాజ్‌లు గత 40ఏళ్లుగా అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ముదిరాజ్‌లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముదిరాజ్‌లు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారన్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీఏలోకి మారుస్తూ జీఓ తెచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముదిరాజ్‌లను బీసీఏలోకి మార్చి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు వెంకటేశ్ ముదిరాజు, నాయకులు జంగం యాదగిరి, తబళాల శ్రీనివాస్, కాళ్లకల్ ఉపసర్పంచ్ పురం రవి, కె. మల్లేశం, దుర్గం వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
సగర లను బీసీ ‘ఏ’లో చేరుస్తాం
శంఖారావం సభలో ఈటెల ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తామని హామీ ప్రమాద బీమా రూ.5 లక్షలకు పెంచుతాం: నాయిని హైదరాబాద్: సగర(ఉప్పర) కులస్తులను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లో చేర్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సగరలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సగరలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన సగర శంఖారావం బహిరంగ సభకు మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు కులవృత్తులకు, సగరలకు కేటాయించిన నిధులను వేరే పథకాలకు మళ్లించాయని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రుణాలను మంజూరు చేయడంలో సాధ్యం కాని షరతులను పెట్టడం వల్ల చాలా మంది రుణాలు పొందలేకపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం సగరల సమస్యల పరిష్కారానికి అన్నివిధాలుగా కృషి చేస్తుందన్నారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో సగర కులస్తులు ముందుండి పోరాడారని కొనియాడారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం జరిగితే బీమా రూపంలో ఇచ్చే రూ. 2 లక్షలను రూ. 5 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సగరలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన సగరల అభివృద్ధికి అసెంబ్లీలో పోరాడతానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సగర (ఉప్పర) సంఘం అధ్యక్షులు బంగారి నర్సింహాసాగర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సగరల కులవృత్తిని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పు తయారు చేసిన ఉప్పరులు కాలక్రమేణాభవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారన్నారు. వలస కూలీలుగా దేశ సంచారం చేస్తున్న సగరల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయడంలేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బీసీ ‘ఏ’లో చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదన్నారు. దేశంలో అనేక భవనాలను నిర్మించినా.. ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేకపోవడంతో సగరలు వెనుకబడి ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సగర కులస్తులను గుర్తించి ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ ‘ఏ’లో చేర్చడంతో పాటు ఈఎండీ లేకుండా ప్రభుత్వ నిర్మాణ పనుల టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సగర (ఉప్పర) కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ద్వారా తమ సంఘాలకు 50 శాతం సబ్సిడీతో నిర్మాణ పనిముట్లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.10 నుంచి రూ. 5 కోట్ల వరకు రుణాలు మంజూరుచేయాలన్నారు. సగరలను అధికారికంగా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి రూ.10 లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ భవన నిర్మాణ సంఘ బోర్డు చైర్మన్‌గా సగరలను నియమించాలన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సీతారాములు, జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రావ్సాగర్, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షులు ఎస్. హనుమంతు సాగర్, కోశాధికారి కె. రాములు సాగర్, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి హరీశ్‌సాగర్, తెలంగాణ రాష్ట్ర సగర మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కుసుమసాగర్, సువర్ణసాగర్ తదితరులు పాల్గొన్నారు.