హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన కులవృత్తుల కుటుంబాల్లో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని తలపెట్టారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, నివాస, ఆహార భద్రత తదితర ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు విధించడంతో అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
► గడచిన వారం రోజులుగా ఖైరతాబాద్, షేక్‌పేట మండల కార్యాలయాలకు బీసీ కులవృత్తుల అర్హులు ధ్రువపత్రాల కోసం బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం కింద సుమారు లక్ష మంది అర్హులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ధ్రువీకరణ పత్రం మంజూరయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుండటంతో లబి్ధదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
►దరఖాస్తు చేసుకునేందుకు ఆహార భద్రతా కార్డులు తప్పనిసరి చేయడంతో నాలుగేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు కానివారంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇలా నష్టపోతున్నవారిలో సుమారు 50 వేల మంది వరకు అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు.
► దీనికి తోడు సర్వర్ డౌన్ మరింత తీవ్ర సమస్యగా మారింది. అసలే గడువు సమీపిస్తున్నదని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా మూడు రోజులుగా సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీని వల్ల మండల కార్యాలయాల్లో పత్రాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి.
దళారులను ఆశ్రయిస్తున్న వైనం...
►నిబంధనల ప్రకారం నూతన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచాలని సూచించడం, గడువు తేదీ సమీపిస్తుండటంతో చాలా మంది లబ్ధిదారులు వీటిని పొందేందుకు పక్కదారులు చూస్తున్నట్లు సమాచారం అందుతున్నది.
► దరఖాస్తుదారుల స్థోమతను బట్టి కొంత మంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మీసేవా కేంద్రాల్లో ఈ పత్రాలు అప్‌లోడ్ చేసేందుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు.
► లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మీ సేవా కేంద్రాలు అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఎలాంటి నిఘా లేకపోవడంతో సమస్య రోజురోజుకు జఠిలమవుతూ లబి్ధదారులు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది.
గడువు పెంచాలి:నాయీ బ్రాహ్మణ సేవాసంఘం
రహమత్‌నగర్: బీసీ చేతి వృత్తులవారికి ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు గడువును పెంచాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయీ మాట్లాడుతూ... దరఖాస్తు చేసేందుకు ఈ నెల 20వ తేదీన ఆఖరి కావడంతో కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం చేతి వృత్తుల వారు తహసీల్దార్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారన్నారు.
విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కులవృత్తుల వారు దరఖాస్తుల చేస్తుండటంతో మీ సేవ సర్వర్ పనిచేయక జాప్యం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు నిరుపేదలు చాలా మందికి రేషన్ కార్డులేక పోవడంతో ఆర్థిక సాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించి, రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన మినహాయించాలని ఆయన కోరారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సత్యనారాయణ, రహమత్‌నగర్ సత్యనారాయణ, కృష్ణానగర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment