
కదిలించిన ‘సాక్షి’ కథనం
సాక్షి’ దినపత్రికలో ‘మానవత్వం మరచి..’ శీర్షికన ప్రచురితమైన కథనం పలువురిని కలచివేసింది.
జడ్చర్ల: కారు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ దినపత్రికలో ‘మానవత్వం మరచి..’అన్న శీర్షికన ప్రచురితమైన కథనం పలువురి మనసులను కలచివేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి.. కారు టాప్‌పై మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమా దం జరిగిన వెంటనే కారును ఆపి చూస్తే.. శ్రీను బతికి ఉండేవాడేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ ఇంత అమానుషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కారు నంబర్ ఏపీ 28 సీకే 8477 ఆధారంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చంద్రకళ పేరున రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు. కారు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జడ్చర్ల వద్ద కేజీఎన్ దాబా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్‌ఐ జములప్ప తెలిపా రు. రిజిస్టర్ సమయంలో ఇచ్చిన మొబైల్ నం బర్‌కు ఫోన్ చేయగా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి విచారించనున్నట్లు పేర్కొన్నారు.
శ్రీను సంపాదనపైనే కుటుంబం జీవనం
శ్రీనివాసులుకు తల్లి దేవమ్మ, భార్య మంగమ్మతో పాటు కుమారుడు శ్రీధ ర్, కూతురు రాజేశ్వరీ ఉన్నారు. ఇతను కొన్నేళ్లుగా స్థానిక పాత ఇనుప సామాను వ్యాపారి దగ్గర కూలీగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూడా జాతీయరహదారి పక్కన పాత ఇనుము వ్యాపారంలో భాగంగా కొనుగోలు చేసిన ఓ వాహన విడిభాగాలను విడదీసేందుకు వెళ్లాడని, రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పని ముగించుకుని ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుందని భార్య మంగమ్మ రోదిస్తూ చెప్పారు. కుటుంబానికి భూమి, ఏ ఆధారం లేదని, కేవలం శ్రీను కూలీ సంపాదనపై మాత్రమే ఆధారపడి కుటుంబం గడుస్తుందని బంధువులు తెలిపారు. ప్రభుత్వపరంగా సాయమందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇంటికి తాళం.. నిందితులు పరారీ
రోడ్డు దాటుతున్న శ్రీనివాసులను ఢీకొట్టి అతని మరణానికి కారణమైన వారి కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గాలించినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. కారునంబర్ ఆధారంగా ‘‘చంద్రకళ భర్త రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రావునగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్’ పూర్తి చిరునామాగా కనుగొన్నారు. జడ్చర్ల ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్, తదితర బృందం ఆ చిరునామా ప్రకారం.. మంగళవారం వెంకట్‌రావునగర్‌లోని ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోవాళ్లు పరారీ అయినట్లు సీఐ తెలిపారు. దీంతో వారిపై కారును వేగంగా నడిపి వ్యక్తి మృతికి కారణమవడమే గాక, సాక్ష్యాధారాలను నాశనం చేశారన్న అభియోగంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ చెప్పారు.