అద్భుతం.. అభినందనీయం | 'Sakshi Excellence' Awards | Sakshi
Sakshi News home page

అద్భుతం.. అభినందనీయం

Published Mon, May 15 2017 1:50 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

అద్భుతం.. అభినందనీయం - Sakshi

అద్భుతం.. అభినందనీయం

‘సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డులపై ప్రముఖ టీవీ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌ ∙అంగరంగ వైభవంగా పురస్కారాల ప్రదానోత్సవం  కళాతపస్వి కె విశ్వనాథ్, మెగాస్టార్‌ చిరంజీవి తదితర అతిరథ మహారథులతో కళకళలాడిన వేదిక దర్శకరత్న దాసరికి తెలుగు శిఖరం అవార్డు ∙కైకాల సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం మొత్తం 29 మందికి పురస్కారాల ప్రదానం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సామాజిక సేవారంగం, కళలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అద్భుత ప్రతిభాపాటవాలున్న విశిష్ట వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అద్భుతం.. అభినందనీయం.. తొలిసారి ఇంత మంది గొప్ప వ్యక్తులను ఒకే వేదికపై కలుసు కున్నందుకు గర్వపడుతున్నాను. వారిని కలుసు కోవడం ఎంతగానో సంతృప్తినిచ్చింది’’ అని ప్రముఖ టీవీ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ మూడో వార్షిక అవార్డుల ప్రదానోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాతపస్వి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్, మెగాస్టార్‌ చిరం జీవి, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తదితరులు హాజరయ్యారు.

తొలుత ‘సాక్షి’ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, బర్కాదత్, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్ఖాదత్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుతం న్యూస్‌ మీడియా సంక్షోభం ఎదుర్కొంటోంది. కొన్ని జాతీయ చానళ్లలో న్యూస్‌ యాంకర్స్‌ టీవీ స్టూడియోల్లోకి ప్రవేశించి రాబోయే రోజుల్లో చోటుచేసుకునే పలు కీలక పరిణామాలపై సొంత వ్యాఖ్యానాలు చేయడం శోచనీయం. మీడియా సామాన్యుల గొంతుకలా నిలవాలి. ‘సాక్షి’ మీడియా అవార్డులకు ఎంపికైన వారి ప్రస్థానంపై ప్రదర్శించిన వీడియో క్లిప్పింగులు చూసిన తర్వాత నేను క్షేత్రస్థాయికి వెళ్లి రిపోర్టింగ్‌ చేసిన అనుభూతిని తలపించింది’ అని అన్నారు.

వివిధ రంగాల్లో ఎంపికైన వారికి బర్ఖాదత్, చిరంజీవి, వైఎస్‌ భారతీరెడ్డి, కె.విశ్వనాథ్, అల్లు అరవింద్‌ తదితరుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజేతలతోపాటు ముఖ్య అతి థులను ఘనంగా సన్మానించారు. తెలుగు శిఖరం అవార్డుకు ఎంపికైన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యకారణాల రీత్యా అవా ర్డును అందుకోవడానికి రాలేకపోయారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు కె.విశ్వనాథ్‌ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. విలన్‌ పాత్రలకే పరిమితమైన సత్యనారాయణను శారద సినిమా ద్వారా గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చూపామన్నారు. ఆయన విలక్షణ నటుడని కొనియాడారు. అనంతరం మెగాస్టార్‌ చిరంజీవిని సాక్షి చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, డైరెక్టర్లు రాణీరెడ్డి, రామచంద్రమూర్తి, కేఆర్‌పీ రెడ్డి, పీవీకే ప్రసాద్‌ ఘనంగా సన్మానించారు.

29 మందికి అవార్డులు..
కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 29 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకోలేకపోయిన వారి తరఫున వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలు ఆయా రంగాల్లో చేసిన కృషిని గుర్తుచేస్తూ ప్రదర్శించిన స్వల్ప నిడివి వీడియో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమ ప్రారంభంలో దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని మాళవిక ఆలపించిన ‘ఉంటాలే..ఉంటాలే.. నీతో ఉంటాలే..’  పాట వీక్షకులను అలరించింది. నటి లావణ్య త్రిపాఠి హిందీ సినీ గీతం ఆలపించి ఆకట్టుకున్నారు.

కార్యక్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వినోద్‌ అగర్వాల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, సమాచార శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) అంజనీకుమార్, డాక్టర్‌ ప్రణతీరెడ్డి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, హీరో నిఖిల్, నటుడు రాజా రవీంద్ర, దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, హీరోయిన్‌ రీచాపనయ్, శాలిని, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ నిర్మాత రవికిరణ్, దర్శకుడు అరుణ్‌ పవార్, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, బిగ్‌సి డైరెక్టర్‌ స్వప్నకుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యావేత్త చుక్కారామయ్య, జ్యూరీ మెంబర్స్‌ జయధీర్‌ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement