సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ అనగానే పుస్తకాల పండుగ గుర్తొస్తుంది. కవులు, కళాకారులు, రచయితల సందడి కన్పిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా అరుదైన నవలలు, ప్రముఖల జీవితగాథలు, చారిత్రక పోరాటాలు, కథలు, ట్రావెలాగ్స్, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి. రాజధాని నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల పాఠక ప్రియులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో పాఠకులు వస్తారని మా అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది’అని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే!
సాక్షి ప్రతినిధి: హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత ఏమిటీ?
జూలూరి: దేశంలోనే అతి ప్రాచీనమైన బుక్‌ఫెయిర్ ఇదే. దీనికంటూ ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. సంస్కృతి, సాహిత్యం, సాహిత్య వేత్తలకు సంబంధించిన సేవలను నెమరువేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈ నేలమీద పుట్టిన రచయితలకు, వారి రచనలకు ఓ వేదిక కల్పిస్తుంది. భిన్న జాతులు, మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు జీవిస్తున్నారు. వారి ఆలోచనలకు, అభిరుచికి తగిన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి వారిలో పఠనాసక్తిని పెంచుతుంది.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైంది?
1985లో మొదటగా చిక్కడపల్లిలోని నగరకేంద్ర గ్రంథాలయంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. స్థలాభావంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ థియేటర్ వద్దకు మార్చాం. ఆ తర్వాత కేశవ్‌మెమోరియల్ గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ మైదానం, నిజాం కళాశాల, పీపుల్స్‌ప్లాజా, ఆ తర్వాత తెలంగాణ కళాభారతిని (ఎన్టీఆర్ స్టేడియాన్ని) పుస్తక ప్రదర్శనకు వేదికగా మార్చాం. తొలి రోజుల్లో 50 స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రస్తుతం 320 స్టాల్స్‌కు చేరుకుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాదు.. వంటలు, బ్యూటీ టిప్స్ బుక్స్, భక్తి, ముక్తి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి.
మారుతున్న కాలంలో పుస్తకాలకున్న ప్రాధాన్యం ఏంటి?
ఇంటర్నెట్, యూట్యూబ్, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు వచ్చాక పుస్తక పఠనం తగ్గిన మాట వాస్తవమే. టెక్నాలజీ ఎంత వచ్చినా పుస్తకాల అమ్మకాలు మాత్రం తగ్గలేదు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. పీడీఎఫ్, ఈ–బుక్ కాపీలను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని మరీ చదువుతున్నారు. బుక్‌ఫెయిర్‌కు లక్షల్లో తరలివస్తున్న పాఠకులే ఇందుకు నిదర్శనం.
తెలుగు సాహిత్య విమర్శ ఏ స్థితిలో ఉంది?
విమర్శ అసలు లేదని కాదు. అది చేయాల్సినంత పని చేయట్లేదన్నది వాస్తవం. విమర్శ సాహిత్యంలోని విలువలను విశ్లేషించి చూపాలి. సమర్థనకో, విస్మృతికో గురిచేయడం సరికాదు. కవిత్వం, కథ వచ్చినంతగా, నవల, విమర్శ రావట్లేదు. కవుల సంఖ్య పెరిగినంతగా విమర్శకుల సంఖ్య పెరగట్లేదు. ఉన్నవాళ్లలో కూడా లోతైన అధ్యయనంతో నిలబడే విమర్శకులను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. యూనివర్సిటీ విద్యార్థుల రూపంలో విమర్శకు కావాల్సిన ముడి సరుకు ఉంది.
వేడుకలా పుస్తక ప్రదర్శన
Published Thu, Dec 13 2018 2:09 AM | Last Updated on Thu, Dec 13 2018 2:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment