సాక్షి ఆసరా
18 మంది అర్హులకు పింఛన్లు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశాలు
‘సాక్షి జనపథం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన
- దాసరి యాకయ్య, పాలకుర్తి
‘ఆసరా’ కోసం అల్లాడుతున్న వారికి ‘సాక్షి’ అండగా నిలిచింది.. గతంలో జనసభలు నిర్వహించి వేలాది సమస్యలు పరిష్కరిస్తే.. ప్రస్తుతం పింఛన్‌దారులకు ఆపన్నహస్తంగా నిలుస్తోంది.. మీ వెంట మేమున్నామంటూ.. మీ కష్టాలను తీర్చేమార్గం చూపుతామంటూ భరోసా ఇస్తోంది.. వికలాంగులకు ఊతకర్రగా.. వితంతువులకు తోడుగా.. వృద్ధులకు ‘బిడ్డ’గా సేవలందిస్తోంది.. శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కొడకండ్ల మండలం వడ్డేకొత్తపల్లిలో జనపథం కార్యక్రమం నిర్వహిం చింది.. స్థానిక ఎమ్మెల్యే, టీడీఎల్‌పీ నేత దయూకర్‌రావు హాజరయ్యూరు.. అర్హులైన 18 మందికి పింఛన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు..
పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం వడ్డేకొత్తపల్లి గ్రామంలో శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యం లో నిర్వహించిన ‘జనపథం’ కార్యక్రమానికి అపూర్త స్పందన లభించింది.. స్థానికులు, అనాథలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా, స్థానిక ఎంపీడీఓ సరిత, తహసీల్దార్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. జనపథంలో ఆసరా కోసం అల్లాడుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పేరు జాబితాలో లేదని.. అధికారులను అడిగితే మళ్లీ రమ్మంటున్నారని.. వయసు తక్కువగా ఉందని అంటున్నారని.. భర్త చనిపోతే సర్టిఫికెట్ తీసుకురమ్మంటున్నారని.. సమగ్ర సర్వేలో వాస్తవ వయసు నమోదు కాలేదని.. వికలాంగ సర్టిఫికెట్ తీసుకురమ్మంటున్నారని.. ఇలా తమ సమస్యలను, గోడును ఎమ్మెల్యే దయూకర్‌రావుకు విన్నవించుకున్నారు. దయూకర్‌రావు అందరి సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం వేదిక దిగి జనపథంలో పాల్గొన్న వారి పింఛన్ మంజూరు కాని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేరు పేరున ఆత్మీయంగా పలకరిస్తూ పింఛన్ వచ్చిందా అవ్వా, తాత అని అడిగి తెలుసుకున్నారు. వారు కూడా రాలేదు సారూ అని చెప్పారు. అప్పుడే ఎమ్మెల్యే దయూకర్‌రావు స్పందించి ‘జనపథం’ వేదిక వద్ద నుంచి 18 మంది అర్హుల జాబితాను అధికారులకు అందజేసి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే స్పందించి వారికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే, అధికారుల హామీతో పింఛను వస్తుందో రాదోననే అనుమానంతో ఉన్న దరఖాస్తుదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్.ప్రవీణ్‌రావు, టీడీపీ జిల్లా నాయకులు రాంచంద్రయ్య శర్మ, ఎంపీపీ జ్యోతి, గ్రామ సర్పంచ్ వెంకన్న, గ్రామ కార్యదర్శి, ప్రజలు పాల్గొన్నారు.
అర్హులకు పింఛన్లు అందించేందుకు ‘సాక్షి’ కృషి అభినందనీయం.. : ఎమ్మెల్యే ‘ఎర్రబెల్లి’ పల్లెల్లో చిన్న చిన్న పొరపాట్లతో అర్హులకు పింఛన్లు అందని విషయాన్ని ‘సాక్షి’ గుర్తించి వారి వివరాలు సేకరించి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావడం అభినందనీయం. వడ్డేకొత్తపల్లి గ్రామంలో సభ నిర్వహించి 18 పేర్లు అర్హులైన వారివి అందజేశారు. వీరికి వెంటనే మంజూరు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నా. ఎక్కడ ఎవరూ దిక్కు లేని వారి కోసం ఆసరా పథకం పెట్టడం జరిగింది. ఈ పథకంలో నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు కాకుంటే పథకం అమలు అభాసు పాలవుతుంది. బంగారు తెలంగాణ నిర్మాణానికి ‘సాక్షి’ చేస్తున్న కృషిని తెలంగాణ ప్రజలు మరువరు.
నా పేరు బొల్లు ఎల్లమ్మ. ఊరు కొడకండ్ల మండలం
వడ్డేకొత్తపల్లి. నాకు 70 ఏళ్లు.. సాతనైత లేదు. కాళ్లురెక్కలు ఆడుతలేవు. సాక్షి పేపరోళ్లు పింఛన్లు ఇప్పిత్తరని మీటింగ్ పెడితే అచ్చిన. ఎమ్మెల్యే రావడం సంతోసం అనిపించింది. సారూ పింఛన్ ఇప్పిత్తనని మాట ఇచ్చిండు. గిప్పుడు నిమ్మలమైంది.. సాక్షి పేపరోళ్లకు రుణపడి ఉంటా.
జనపథంలో గుర్తించిన లబ్ధిదారులు వీరే..
1. మద్దేల వీరసాయిలు(వృద్ధాప్య)
2. బాలు ఎల్లమ్మ(వితంతువు)
3. ఎల్మ సాయిలు(వృద్ధుడు)
4. శిరంశెట్టి వీరయ్య(వికలాంగుడు)
5. తుప్పతూరి యాదగిరి(వృద్ధుడు)
6. గంగాధరి స్పప్న(వికలాంగురాలు)
7. మేకల అనిల్(మూగ)
8. గుమ్మడవెల్లి నారాయణ(వృద్ధుడు)
9. భూపతి సోమయ్య(వృద్ధుడు)
10. దంతాలపల్లి సోమయ్య(వృద్ధుడు)
11. దంతాలపల్లి మల్లయ్య(వృద్ధుడు)
12. కొమ్ము ముత్తయ్య(వృద్ధుడు)
13. బానోతు లచ్చి(వృద్ధురాలు)
14. తంతాలపల్లి ముత్తిలింగమ్మ(వితంతువు)
15. చుంచు నాగమ్మ(వితంతువు)
16. స్వర్గం నరేష్(వికలాంగుడు)
17. గుండె వెంకటయ్య(వికలాంగుడు)
18. మేకల సోమక్క(వృద్ధురాలు)