- స్మార్ట్ సర్వేలో చెడిపోయిన ట్యాబ్‌లు
- పింఛన్‌దారులకు ఇక్కట్లు
250 పంచాయతీల్లో పింఛన్లకు అంతరాయం
Published Sat, Oct 1 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
రామచంద్రపురం :
ప్రజా సాధికారిక సర్వే పింఛన్‌దారుల పాలిట శాపంలా మారింది. ప్రతినెలా ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా ఈ నెల లేకుండాపోయింది. జిల్లాలో శనివారం ప్రారంభమైన పింఛన్ల పంపిణీ 250 పంచాయతీల్లో నిలిచిపోయింది. జిల్లాలో 1069 పంచాయితీలున్నాయి. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 5వతేదీ వరకు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,73,673 పింఛన్లదారులకుగాను సుమారుగా రూ. 50.89 కోట్లు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. సుమారుగా 24 వేల మంది ఫించన్‌దారులు శనివారం పంచాయతీలకు వచ్చి ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోయారు.
గత నెల నుంచే మరమ్మతులు...
ప్రతి నెలా పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ చేసే ట్యాబ్‌లు గత నెలలోనే మరమ్మతులకు గురయ్యాయి. పలుచోట్ల పించన్లు పంపిణీ చేసే ట్యాబ్‌లను ప్రజా సాధికారిక సర్వేకు వినియోగించారు. ఈ సర్వేలో కొన్ని ట్యాబుల్లో డేటా డిలిట్ జరగ్గా, మరికొన్ని ట్యాబ్‌ల్లో మొత్తం చెడిపోయాయి. ఆయా ట్యాబ్‌లకు మరమ్మతులు చేయించేందుకు సుమారుగా రూ.30 లక్షల వరకు అవుతుందని అంచనా వేశారు. కానీ వాటికి తిరిగి మరమ్మతులు చేయటంలో అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
Advertisement
Advertisement