అంగన్‌వాడీ కార్యకర్తలకు కేసీఆర్ వరాలజల్లు
హైదరాబాద్ : అంగన్‌వాడీ కార్యకర్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అంగన్ వాడీ కార్యకర్తలకు, సహాయ సిబ్బందికి జీతాలు పెంచుతూ ప్రకటన చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలు జీతం నెలకు రూ.10, 500, కార్యకర్తల సహయకుల జీతం రూ.6000లకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు తగినంత ఆహారం ఇవ్వాలని, గతంలో ఇచ్చినట్లు గ్రాముల లెక్కన వారికి ఆహారం ఇవ్వరాదని, అలాగే పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే మరో ఏడాది తర్వాత మళ్లీ జీతాలు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్హతలు ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలకు సూపర్ వైజర్లుగా పదోన్నతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని కార్యకర్తలకు ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం విషయంలో తిన్నంత పెట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. గతంలో మాదిరిగా గ్రాముల లెక్కన ఆహారం పెట్టొద్దన్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని చెప్పారు.