వేతనాల పటాస్
హైదరాబాద్: ‘స్థానిక ’ ప్రజా ప్రతినిధులకు రాష్ర్ట ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కౌన్సిలర్, సర్పంచ్ మొదలుకొని జెడ్పీ చైర్మన్ వరకు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారందరికీ గౌరవ వేతనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం నెలకు రూ. 7,500 తీసుకుంటున్న జెడ్పీ చైర్మన్లు ఇకపై లక్ష రూపాయలు అందుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే వేతనాల పెంపు అమల్లోకి రానుంది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకూ జీతభత్యాలను భారీగా పెంచేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం.
ఒక్కో ప్రజాప్రతినిధికి రూ. 2 లక్షల మేర చెల్లించనున్నట్లు ఈ సమావేశాల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా స్థానిక సంస్థల సభ్యులకు గౌరవ వేతనాలను పెంచాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీనిపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వేతనాల పెంపునకు నిర్ణయించారు. ‘స్థానిక’ ప్రతినిధులకు వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వంపై రూ. 93 కోట్ల అదనపు భారం పడనుందని ఆయన సభలో వెల్లడించారు.
కొందరు హర్షం.. మరికొందరు నిరసన..
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల పలు సంఘాలు హర్షం ప్రకటించగా.. మరికొందరు తక్కువ పెంపు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘స్థానిక’ నేతల సమస్య పట్ల సానుకూలంగా స్పందించినందుకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, కార్యదర్శి డాక్టర్ వైబీ సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోంరెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌కు, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సర్పంచులు, ఎంపీటీసీలకు తక్కువగా పెంచడంపై పునరాలోచన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
సర్పంచుల డిమాండ్ల సాధనకై ఈ నెల 19న తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం విషయమై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు సర్పంచుల సంఘం సచివాలయంలో తలపెట్టిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచుల వేతనాన్ని కేవలం రూ. 5 వేలుగా నిర్ణయించడాన్ని తప్పుబడుతూ కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరైతే డి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్ ముందు ధర్నాకు దిగారు. దీంతో సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సిన మంత్రి కేటీఆర్ తన చాంబర్‌కే పరిమితమయ్యారు. సచివాలయంలో ఆందోళనకు దిగిన సర్పంచులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటకు పంపారు. కాగా, కొందరు సర్పంచ్‌లు కేటీఆర్ చాంబర్‌కే కృతజ్ఞతలు తెలిపారు. మరికొందరు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ని కలిశారు.
విపక్షాల విస్మయం
రాష్ర్టంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ‘స్థానిక’ ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించడంతో ఈ అంశం కోడ్ పరిధిలోకి వస్తుందా.. రాదా అన్న అంశంపై విపక్షాలు చర్చించుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఎన్నికల నోటిఫకేషన్ వెలువడకముందే సీఎం ప్రకటన చేసినప్పటికీ.. ఈసీ అనుమతిలో జాప్యం వల్ల ఇప్పటికీ పీఆర్‌సీ ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలకు సంబంధించి ఈసీ అనుమతిపై స్పష్టత లేకపోవడంతో విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకూ పెంపు!
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలను కూడా రాష్ర్ట ప్రభుత్వం భారీగా పెంచనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన జీతాల పెంపు అంశాన్ని నవంబర్‌లోనే కేసీఆర్ సమీక్షిం చారు. ఎమ్మెల్యేలు సొంత వాహనాల్లో నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వివిధ కమిటీల్లో సభ్యులుగా ఉండటంతో సమావేశాలకు హాజరవుతున్నా రు. జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలకు వెళుతున్నారు. ఇందుకు చాలా ఖర్చవుతున్న దృష్ట్యా వారి జీతాలు పెంచడం అనివార్యమని సీఎం అభిప్రాయపడ్డారు. బడ్జెట్ తయారీ సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ర్టంలో 120 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నా రు. ప్రస్తుతం వీరికి రూ. 95 వేల వరకు జీతభత్యా లు అందుతున్నాయి. సీఎం, మంత్రులు, కేబినేట్ హోదా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట రీ కార్యదర్శులు మినహాయిస్తే మిగతా 124 మంది కి రూ. 2 లక్షల చొప్పున చెల్లించాలని భావిస్తోంది. దీంతో నెలకు రూ. 2.50 కోట్లు, ఏడాదికి రూ. 30 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించ డంతో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ప్రకటన ఉంటుందని సమాచారం.
గౌరవ వేతనాల వివరాలు
గ్రామీణ ప్రాంతాల్లో..
హోదా - ప్రస్తుతం(రూ.లలో) - పెంచినది(రూ.లలో)
జడ్పీ చైర్మన్ - 7,500 లక్ష
జడ్పీటీసీ సభ్యుడు - 2,250 - 10,000
ఎంపీపీ అధ్యక్షుడు - 1,500 - 10,000
ఎంపీటీసీ సభ్యుడు - 750 - 5,000
గ్రామ సర్పంచ్ - 1,500 - 5,000
నగర/పట్టణ ప్రాంతాల్లో..
మేయర్ - 14,000- 50,000
డిప్యూటీ మేయర్ - 8,000 - 25,000
కార్పొరేటర్ - 4,000 - 6,000
స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీల్లో..
మున్సిపల్ చైర్మన్ - 10,000 - 15,000
వైస్ చైర్మన్ - 5,000 - 7,500
కౌన్సిలర్లు - 2,200 - 3,500
ఇతర మున్సిపాల్టీల్లో..
చైర్మన్ - 8,000 - 12,000
వైస్ చైర్మన్ - 3,200 - 5,000
కౌన్సిలర్ - 1,800 - 2,500