వంగూరు: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదుచేయాలని ఒకరంటే.. కుదరదని మరొకరు అంటున్నారు. ఈ ఉదంతం ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌కు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. మండలంలోని దుందుబీ నది నుంచి కొనసాగుతున్న ఇసుకకు జిల్లాలోనే పేరుకుంది. ఈ అక్రమ రవాణాపై అప్పట్లో లోకాయుక్త కూడా స్పందించింది.
ఇదిలాఉండగా, ఇటీవల స్థానిక అవసరాలను గుర్తించి అధికారులు అనుమతివ్వగా ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు అక్రమదందాకు తెరతీశారు. ఈ వ్యవహారంలో ఎస్‌ఐ నరేష్, తహశీల్దార్ సైదులు మధ్య విబేధాలు పొడచూపాయి. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లపై తక్షణమే కేసులు నమోదుచేసి కోర్టుకు పంపించాలని తహశీల్దార్ ఎస్‌ఐని కోరగా.. అలాచేయడం కుదరదని, నిబంధనలు మారాయని తేల్చిచెబుతున్నారు. పట్టుకున్న ట్రాక్టర్, లారీలను మైనింగ్ అధికారులకు సరెండర్ చేయడం తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు. దీంతో తహశీల్దార్ నేరుగా తన సిబ్బందితో ట్రాక్టర్లను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఐదుట్రాక్టర్లను పట్టుకోగా ఎస్‌ఐ కేసులు నమోదుచేయకుండా తిప్పిపంపించారు. ఈ వ్యవహారం ఏఎస్పీ, ఆర్డీఓ దృష్టికి కూడా వెళ్లింది.
అధికారులు ఏమన్నారంటే.. ‘‘ వాహనాలపై కేసులు చేసి డ్రైవర్, ఓనర్లను కోర్టులో రిమాండ్ చేయాలి. గతంలో మాదిరిగానే కేసులు చేయమంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం’’ అని తహశీల్దార్ సైదులు అన్నారు. ‘‘పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు, లారీలను ఒకటి, రెండోసారి మైనింగ్ అధికారులకు పంపించి జరిమానా కట్టిస్తాం. మూడోసారి దొరికితే కేసులు పెడతాం. ఇటీవల కొన్ని నిబంధనలు మారాయి. అందుకోసం కేసులు చేయలేకపోతున్నాం’’ అని ఎస్‌ఐ నరేష్ స్పష్టంచేశారు.
ఇసుక దుమారం
Published Thu, Jul 2 2015 1:16 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM
Advertisement
Advertisement