అక్రమంగా ఇసుకను తోడేస్తున్న దృశ్యం
కొల్చారం(నర్సాపూర్): కొల్చారం మండలంలో ప్రవహిస్తున్న మంజీర నది ఇక్కడి రైతులకు వరప్రదాయిని. మండలంలోని ఎనగండ్ల, వైమాందాపూర్, కోణాపూర్, పైతర, రంగంపేట, తుక్కాపూర్, చిన్నఘనాపూర్ గ్రామాల గుండా నది ప్రవాహం ఘనాపురం ఆనకట్ట వరకు కొనసాగుతుంది. రైతులు ఈ మంజీర నీటిని మోటార్ పైప్‌లైన్ల ద్వారా ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నారు. మేటవేసిన ఇసుక వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి బోర్లు వట్టిపోకుండా ఇక్కడి రైతులకు మంజీర జీవనాధారంగా మారింది. రైతుల బాధలు పట్టని కొందరు అక్రమ ఇసుక దందాకు తెర లేపుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఇసుక అవసరం అంటూ ఆయా గ్రామాల రైతులను మోసం చేస్తూ ‘పెద్ద’ ప్రజాప్రతినిధుల పేర్లను వాడుతూ ఇసుక దందాకు తెరలేపారు.
మంజీర ఇసుక ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు వాడవచ్చా?
ప్రభుత్వం చేపట్టే భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజీర ఇసుక ఏమాత్రం ఉపయోగపడదని స్వయాన సంబంధిత శాఖలకు చెందిన అధికారులే అంగీకరిస్తున్నారు. ఇక్కడి ఇసుకలో మట్టి పాళ్లు ఎక్కువగా ఉండడంతోపాటు నల్లని గుండురాయి కూడా మిళితమై ఉందని, దీన్ని నిర్మాణాలకు వాడితే తక్కువ కాలంలోనే బీటలువారే పరిస్థితి వస్తుందన్నది అధికారుల సమాధానం. గతంలో మండలంలో నిర్మించిన భవనాలు, సీసీ రోడ్లు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఈ పరిస్థితుల్లో బోధన్ నుంచి ఇసుక తెచ్చేందుకు అవసరమైన రవాణా చార్జీలను సైతం కాంట్రాక్టర్లకు అందిస్తూ వస్తున్నారు. కొల్చారం మండలానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇసుకను తీసుకువచ్చేందుకు రవాణా చార్జీని అందిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడి ఇసుకను వాడుతున్నారు. లంచాలకు అలవాటుపడిన అధికారులు నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో మంజీర ఇసుక కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న మంజీర ఇసుక
ప్రభుత్వ పనులే కదా ఉంటేనేం.. కూలితేనేం.. అన్న రీతిలో ఏ మాత్రం నిర్మాణాలకు ఉపయోగపడని ఇక్కడి ఇసుకను వాడుతున్నారు. ట్రాక్ట ర్ ఇసుక రూ.2500కే దొరుకుతుండడం, అధికారులు ఎవరూ అడ్డు చెప్పకపోవడం కాంట్రా క్టర్లకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా ఉన్న నాయకులు సైతం ఊరుకుంటుండడంతోపాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇక్కడి ఇసుకను అక్రమంగా రవాణా చేసేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
రైతుల గోసపట్టని రెవెన్యూ అధికారులు
మండలంలో 80శాతానికిపైగా బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న పరిస్థితుల్లో నదిలో ఉన్న కొద్దిపాటి ఇసుకను తోడేస్తున్నా రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పని ఏదైనా విచారించకుండానే విచ్చల విడిగా అనుమతులు ఇస్తుండడంతో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. ఇసుక తీస్తే బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలు పండక తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలుమార్లు ఇక్కడి రైతులు అధికారులకు మొరపెట్టుకున్నా వారు అవేమీ పట్టించుకోవడం లేదు. కొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే పేరుతో సమీప మంజీర పరివాహక ప్రాంతాల రైతులను బెదిరించి ఇక్కడి నుంచి ఇసుకను ఇతర మండలాలకు తరలించుకుపోవడం దినచర్యలా మారిపోయింది.
ఇసుక అక్రమ రవాణాను ఆపాలి
మా గ్రామం నుంచే గవర్నమెంట్ పనులకని ఇసుకను తరలిస్తున్నారు. దీంతో బోర్లలో నీరు చేరకుండా ఎండిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలా ఎంతకాలం ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తారు. వెంటనే ఆపివేయాలి.
– సంగప్ప, తుక్కాపూర్
పైనుంచి ఒత్తిడితోనే అనుమతులు
పైనుంచి ఒత్తిడిలు ఎక్కువగా ఉన్నందునే మంజీర నది నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాలకు ఇసుక ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయమై చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. అయినా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వక తప్పడం లేదు.
– రమేష్, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment