తోడేస్తున్నారు !
తూప్రాన్‌లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ఖాళీ అవుతున్న హల్దీ వాగు
మామూళ్ల మత్తులో అధికారులు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఆందోళనలో అన్నదాతలు
తూప్రాన్‌లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రైతులకు జీవనాధారంగా ఉన్న హల్దీ వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి మండలంలో ఎక్కడ చూసినా వట్టిపోయిన బోరుబావులు, చెరువులు, కుంటలు దర్శనమిస్తున్నాయి. 600 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో వ్యవసాయం చేసేదెట్టా అని రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తూప్రాన్ ఎడారిగా మారే ప్రమాదం ఉందని భూగర్భజల శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
- తూప్రాన్
తూప్రాన్ మండలంలోని నాగులపల్లి, జెండాపల్లి, బ్రహ్మణపల్లి, వట్టూరు, కిష్టాపూర్, యావపూర్ తదితర గ్రామాల నుంచి హల్దీ వాగు పారుతుంది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని బావులతో పాటు సమీప గ్రామాల్లోని రైతులు వాగును నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయా గ్రామాల నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి వందలాది బోరుబావులు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులపై ఆరోపణలు
అధికారుల అండదండలతో ఇసుక వ్యాపారం మూడు డంపులు.. ఆరు లారీలుగా కొనసాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురుల కనుసన్నల్లోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని పేర్కొంటున్నారు. బహిరంగానే ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోరుబావులే ఆధారం..
తూఫ్రాన్ మండలంలో భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు లేని కారణంగా చెరువులు, కుంటలు, బోరుబావులపైనే ఆధారపడి రైతులు వ్యవసాయాన్ని చేపడుతున్నారు. గతంలో 200 నుంచి 300 అడుగుల లోపే బోర్ల లో నీళ్లు రాగా నేడు 600అడుగులకు పైగా బోర్లు వేసినా నీళ్లు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇసుక తరలింపును అదుపు చేకపోతే భవిష్యత్ ప్రశ్నార్థమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
కేసులు నమోదు చేస్తాం
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తాం. ఇప్పటికే ఇసుక వ్యాపారులతో సమావేశం నిర్వహించి హెచ్చరించాం. ప్రత్యేక టీంనుం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైన అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి.
-వెంకటేశ్వర్లు, డీఎస్పీ, తూఫ్రాన్