సాక్షి, హన్మకొండ : మల్లంపల్లి మైనింగ్ మాఫియా సంచనాలకు కేంద్రంగా మారుతోంది. హింసాత్మక సంఘటలు, అవినితీ వ్యవహరాలతో ఇటీవల మల్లంపల్లి చర్చనీయాంశంగా మారింది. మైనింగ్ కంపెనీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చిలికిచిలికి గాలివానగా మారింది. సహాజవనరులను ఇష్టారీతిగా కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీ చూడనట్లుగా వ్యవహారిస్తున్నాయి. మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ భవనాలకు వెనకవైపు ఎస్సారెస్పీ కాలువ సమీపంలో 15 కంపెనీలు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇక్కడ మైనింగ్‌లో తవ్విన ఎర్రమట్టిని తరలించడనికి సరైన రోడ్డు మార్గం లేదు. ఎర్రమట్టిని తరలించేందుకు అటవీశాఖ భూముల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో అటవీశాఖ అధికారుల చేతులు తడిపి ఫారెస్టు భూముల నుంచి లారీలను నడిపించారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ ఓ ఫారెస్టు రేంజి అధికారి ఎర్రమట్టి రవాణాకు దారి అనుమతి లేదంటూ కొన్నాళ్ల పాటు లారీలను అడ్డుకున్నాడు. ఇక్కడి మైనింగ్ కంపెనీల మధ్య వ్యాపార సంబంధమైన పోటీని ఆసరగా చేసుకుని ఎక్కువ ముట్టచెప్పిన వారికే అనుమతి ఇస్తానంటూ బేరం పెట్టాడు. చివరికి కొందరు మైనింగ్ వ్యాపారులు బృందంగా ఏర్పడి సుమారు రూ.12 లక్షలు సదరు అధికారికి సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఒక్కరికే అనుమతి
సిన్సియర్ అధికారిగా కలరింగ్ ఇచ్చి మైనింగ్ మాఫియాలో ఒక వర్గాన్ని తన దారిలోకి తెచ్చుకుని బహుమతి అందుకున్న అధికారి తీరులో మార్పు వచ్చింది. తనకు నజరాన ముట్టచెప్పిన కంపెనీల వ్యాపారం చక్కగా సాగేందుకు అటవీ భూమికి పక్కన ఉన్న రైతుల నుంచి స్థలాలను కొన్నట్లుగా సుమారు 15 ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలను అవినీతి ఫారెస్టు అధికారి సృష్టించినట్లుగా తెలుస్తోంది. నెలవారీగా రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు ముడుపులు అందుతుండటంతో ఈ విషయం బయటకు రావడంలేదు. కొందరు వ్యాపారుల లారీలకు అనుమతి ఇచ్చి.. మిగిలిన మైనింగ్ కంపెనీల రవాణాను అడ్డుకోవడంతో ఇక్కడ మైనింగ్ వ్యాపారుల మధ్య పోరు మొదలైంది. ఫారెస్టు అధికారి అండతో తమ వ్యాపారాలను అడ్డుకుంటున్న ఎదుటి వర్గం ఆట కట్టించేందుకు వీరు గట్టిగానే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కోవలోనే ఇటీవల జిల్లాలో సంచనాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో ఇదేతీరు
జాతీయ రహదారి(163) నుంచి మల్లంపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో నుంచి మైనింగ్ కార్యకలాపాలకు అటవీశాఖ అడ్డదారి చూపింది. అటవీభూమి కంపార్ట్‌మెంట్ నెంబర్ 599, 600ల నుంచి క్వారీలకు వందలాదిగా లారీలు వచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇదేమంటే సదరు భూ భాగాన్ని సోషల్ ఫారెస్ట్‌కు లీజుకు ఇచ్చారని.. దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్లదేనంటూ అటవీశాఖ సెలవిస్తోంది. ఎర్రమట్టి లోడుతో వెళ్తున్న భారీ వాహనాలు ఎస్సారెస్పీ కాలువ మీదుగా వెళ్తున్నాయి. దీంతో కాలువ కుంగి పోతోందని రైతులు పేర్కొంటున్నారు.
ఓవర్‌లోడ్‌లతో లారీలు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఓవర్‌లోడు వాహనాల వల్ల మల్లంపల్లి నుంచి రాంచంద్రాపురం వరకు రోడ్డు అడుగుకో గుంత అన్న పరిస్థితి ఉంది. నిత్యం లారీల రద్దీతో పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి, మిరప తోటలపై ఎర్రని దుబ్బ అలముకుని మొక్కలు చనిపోతున్నాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక ప్రతీ ఏటా ఇబ్బందులు పడుతున్నా... ఎవరూ పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఈ విషయంలో పలుసార్లు అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. పచ్చని చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ చేయాల్సిన సోషల్ ఫారెస్ట్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ను అరికట్టాల్సిన అవసరముంది.
ఎత్తులు.. చిత్తులు
Published Wed, Sep 30 2015 4:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement