వేల్పూర్ : వేల్పూర్ మండలం అక్లూర్ వాగు వద్దకు ఇసుక అక్రమ రవాణాకు వచ్చిన ఐదు టిప్పర్లను తహశీల్దార్ శేఖర్, ఎస్సై కృష్ణ గురువారం వేకువ జామున పట్టుకున్నారు. అక్లూర్ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామానికి చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ వాగు వద్ద రెవెన్యూ సిబ్బందిని రాత్రిపూట కాపలాగా ఉంచారు. ఎప్పటిలాగే అర్ధరాత్రి ఇసుక టిప్పర్లు రావడంతో రెవెన్యూ సిబ్బంది తహశీల్దార్‌కు సమాచారం అందించారు.
దీంతో ఆయన ఎస్సైని తీసుకొని వాగువద్దకు చేరుకున్నారు. టిప్పర్లు వాగు వద్దకు చేరగానే పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఆలయానికి నిధుల కోసం గ్రామస్తులు ఇసుక అక్రమ రవాణాకు రాత్రిపూట అనుమతించినట్లు సమాచారం. సుమారు రూ. 3.50 లక్షలకు ఐదు టిప్పర్లకు అనుమతించినట్లు తెలిసింది. అక్లూర్ నుంచి పచ్చలనడ్కుడ, జాన్కంపేట్ గ్రామాల మీదుగా ఆర్మూర్ పట్టణానికి దగ్గరగా దారి ఉండడంతో వ్యాపారులు అర్ధరాత్రి పూట తమ పనిని సునాయసంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన టిప్పర్లకు ఒక్కోదానికి తహశీల్దార్ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు.
అనుమతి పేరిట అక్రమ రవాణా!
మండలంలోని కుకునూర్ వాగు నుంచి అభివృద్ధి పనులకు ఇసుక సరఫరాకు ఇస్తున్న అనుమతితో అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న రూ. 125 కోట్ల తాగునీటి సరఫరా పథకానికి, నిర్మల్ ప్రాంతంలో జరుగుతున్న ప్రాణహిత చేవెళ్ల పథకం పనులకు అధికారులు అనుమతులిచ్చారు. వారంలో ఐదు రోజుల పాటు రెండు పథకాలకు కుకునూర్ నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. వేబిల్లుతో ఇక్కడి నుంచి వెళ్లిన ఇసుక నిజంగా పనులు జరుగుతున్న చోటుకు చేరుతుందా? లేదా ! అనేది అనుమానాస్పదంగా మారింది.
ఇసుక తీసుకెళ్లిన లారీ తిరిగి వేబిల్లులు మాత్రం సక్రమంగా తెచ్చి అధికారులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. కానీ చివరి వరకు చేరినట్లు నమ్మడమే తప్ప ఎవరూ చూసిన దాఖలాలు కన్పించడ ంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు రోజుల క్రితం కుకునూర్ నుంచి ఆర్మూర్‌కు సరఫరా చేసేందుకు ఇచ్చిన అనుమతితో బయల్దేరిన టిప్పరు మండలంలోని పడగల్ మీదుగా వెళుతుండగా, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు హన్మంత్‌రావు అడ్డుకొని వీఆర్వోలకు పట్టించారు. దీంతో అనుమతితో వెళ్లిన ఇసుక సక్రమంగా చేరడం లేదని స్పష్టమవుతోంది. అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతుండగా, వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని సక్రమంగా వెలగబెట్టుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇసుక టిప్పర్లు పట్టివేత
Published Fri, Nov 21 2014 2:41 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement