సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లో ఇద్దరు నేతల మధ్య రాజకీయ పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. వేర్వేరు పార్టీల నుంచి ఇద్దరు నేతలు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నా... ఒకరి నీడను మరొకరు తాకడం లేదు. వీరిలో ఒకరు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల మంత్రి పదవి చేపట్టిన గంగుల కమలాకర్ అయితే... మరొకరు ఎమ్మెల్యేగా గంగుల చేతిలో ఓడిపోయి... కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించిన బండి సంజయ్‌కుమార్.
ఎంపీగా సంజయ్ గెలిచిన నాటి నుంచి గంగులతో అంటీ ముంటనట్టుగానే ఉంటున్నప్పటికీ... గత కొద్దిరోజులుగా దూరం మరింత పెరిగింది. ఎంతగా అంటే ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో కూడా సంజయ్ పాల్గొన లేనంతగా...! వచ్చే మునిసిపల్ ఎన్నికలను ఇరుపార్టీలు సవాల్‌గా తీసుకున్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వార్ ఎటువైపు దారితీస్తుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
స్మార్ట్‌సిటీ టెండర్ల ఖరారుపై వ్యతిరేకత
కరీంనగర్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. రూ.1878 కోట్ల అంచనా వ్యయంతో కరీంనగర్‌ను ఆధునీకరించాలనేది ఈ స్మార్ట్‌సిటీ కాన్సెప్ట్. ఇందులో భాగంగా పటిష్టమైన సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. రూ.217.7 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల్లో సుమారు 30 కిలోమీటర్ల మేర తొలిదశలో రోడ్ల నిర్మాణానికి గత సంవత్సరం ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించగా, ఒకసారి బిడ్డర్లు ఎవరూ రాక రద్దయింది. రెండోసారి మూడో ప్యాకేజీ టెండర్ ఖరారైనప్పటికీ, ఒకటి, రెండు ప్యాకేజీలకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఓ వైపు కోర్టులో కేసు ఉండగానే మూడోసారి టెండర్లను పిలిచారు.
ఈ టెండర్ల ప్రక్రియ గడువు మూడురోజుల్లో పూర్తవుతుందనగా, ఆ టెండర్లను వాయిదా చేసినట్లు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఓ ప్రతిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గంగుల మంత్రి కాకముందే ఎమ్మెల్యే హోదాలో రంగ ప్రవేశం చేసి, 2వ విడత కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌ను కేసు ఉపసంహరించుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో మూడో విడత టెండర్లలో పాల్గొన్న రాజరాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు రూ.164 కోట్ల విలువైన 1, 2 ప్యాకేజీలను అప్పగిస్తూ టెండర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇక్కడే ఎంపీ హోదాలో తొలిసారి సంజయ్ రంగ ప్రవేశం చేశారు. సింగిల్ టెండర్‌ను ఆమోదించడం, ఒకవైపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, టెక్నికల్ అంశాలను సాకుగా చూపి కాంట్రాక్టర్‌ను ఖరారు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపించడమే కాకుండా టెండర్లపై విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు.
ఎంపీ, మంత్రి మధ్య గ్రానైట్ రాయి
దీనిపై రాద్ధాంతం సాగుతుండగానే మరోవైపు కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారులు వందల కోట్ల రూపాయల రాయల్టీని ప్రభుత్వానికి ఎగ్గొట్టారని, అపరాధ రుసుం కింద విధించిన సుమారు రూ.700 కోట్లు సర్కారుకు చెల్లించలేదని హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శించారు. గంగుల కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని సంజయ్ 2009 నాటి గ్రానైట్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారనేది టీఆర్‌ఎస్ నేతల వాదన. మంత్రిగా గంగుల ప్రమాణం స్వీకారం చేసిన తరువాత సంజయ్ విమర్శల జోరు పెంచగా, ఇటీవల గంగుల కూడా తీవ్రంగానే స్పందించారు. కాగా ఇటీవల కరీంనగర్ వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్మార్ట్‌సిటీ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని వ్యాఖ్యానించడం, పారదర్శకంగా స్మార్ట్‌సిటీ పనులు జరిగేలా చూస్తామనడం గంగుల వర్గానికి ఉత్సాహాన్ని ఇవ్వగా, గ్రానైట్ సమస్యపై మాత్రం కిషన్‌రెడ్డి ఎంపీ సంజయ్‌కు అనుకూలంగా మాట్లాడారు.
అధికారిక కార్యక్రమాలకు దూరం
గంగుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్మార్ట్‌సిటీ పనులు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే రోజు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ హాజరు కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కరీంనగర్ వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, మంత్రి కమలాకర్ హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా మంత్రి రాలేదని టీఆర్‌ఎస్ నేతలు సమర్థించుకున్నారు.
కాగా సోమవారం కలెక్టరేట్‌లో మంత్రి కమలాకర్ ‘నేను సైతం... నా నగరం కోసం’ అనే అధికారిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కమలాకర్ స్వయంగా డిజైన్ చేసినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో పాల్గొనే కార్యక్రమం. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కూడా సంజయ్ రాలేదు. అలాగే 5వ డివిజన్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుగగా, సంజయ్ యధావిధిగా హాజరుకాలేదు. ఒకరు లేని సమయంలో మరొకరు ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందిస్తున్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది.
రాజకీయ సమకాలికులే...
ఇంజినీరింగ్ చదివి వ్యాపారం చేసుకుంటూ 2000 సంవత్సరంలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు గంగుల కమలాకర్. అప్పటి కరీంనగర్ మునిసిపాలిటీకి టీడీపీ తరఫున వార్డు కౌన్సిలర్‌గా గెలిచి వెనుదిరిగి చూడలేదు. కరీంనగర్‌కే చెందిన బండి సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, శిక్షక్‌గా ఎదిగి ఏబీవీపీ ద్వారా తొలుత విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. తరువాత 1994లోనే అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా గెలిచి దాదాపు పదేళ్లు కొనసాగారు.
2005లో తొలి కార్పొరేషన్‌కు బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ కౌన్సిల్‌లో గంగుల సైతం టీడీపీ తరఫున ఫ్లోర్‌లీడర్. 2009లో గంగుల ఎమ్మెల్యేగా గెలిచి, 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో గంగుల కమలాకర్‌పై పోటీ చేసిన సంజయ్ రెండుసార్లు ఓడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనూహ్య విజయం సాధించారు. రాజకీయ సమకాలికులే అయినప్పటికీ, పార్టీలు వేరు కావడంతో ప్రస్తుతం ఎంపీ వర్సెస్ మంత్రిగా కరీంనగర్ రాజకీయం మారింది.
Comments
Please login to add a commentAdd a comment