చికిత్స పొందుతున్న దేవదాసు
మల్లాపూర్ (కోరుట్ల): ‘ఏకగ్రీవం’వ్యవహారం ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రాణాల మీదకు తెచ్చింది. సర్పంచ్ పీఠం దక్కాలంటే రూ.పది లక్షలు డిమాండ్ చేసిన గ్రామకమిటీ.. రూ.ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడతగా రూ.రెండు లక్షలు చెల్లించినా.. మిగతా వాటి కోసం పట్టుబట్టడంతో మనస్తాపం చెందిన సదరు అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తండాలో సోమవారం జరిగింది. ఈ తండా ఇటీవలే కొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. తొలిసారి పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 275 మంది ఓటర్లు కలిగిన ఈ తండాలో ఆరు వార్డులుసహా సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సర్పంచ్ పదవికి రూ.10 లక్షలు ఇవ్వాలని తీర్మానించగా.. గ్రామానికి చెందిన భూక్య దేవదాస్ (55) రూ.5 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. ఇందుకు గ్రామస్తులు అంగీకరించగా.. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.3 లక్షలను ఈ నెల 10న చెల్లించేందుకు ఒప్పందపత్రం రాయించుకున్నారు. అయితే సోమవారం మరోసారి సమావేశమైన గ్రామస్తులు మిగిలిన రూ.3 లక్షలు వెంటనే చెల్లించాలని, లేకుంటే మరో వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటామని హెచ్చరించారు. ఒప్పందం ప్రకారం గడువులోపు రూ.3 లక్షలు చెల్లిస్తానని గ్రామస్తులను బతిమిలాడినా వారు ససేమిరా అనడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దేవదాస్ ఇంటికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటా హుటిన మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఏకగ్రీవం.. గందరగోళం
పలు గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక వ్యవహారం గందరగోళం.. గొడవలకు కారణమవుతోంది. ఓ చోట గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌లో సోమవారం చోటుచేసుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి, కృష్ణాపురం గ్రామాలు ఒక్కటే గ్రామపంచాయతీ పరిధిలో ఉండేవి. సర్పంచ్‌ను నాలుగుసార్లు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఈసారి పోతిరెడ్డిపల్లి, కృష్ణాపురం గ్రామాలు వేర్వేరు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. గతంలో కృష్టాపురం గ్రామనాయకుడు గట్టు నర్సింహాచార్యులు అందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఏకగ్రీవం చేసేవాడు. కాగా, కొత్త పంచాయతీ అయిన పోతిరెడ్డిపల్లిలో సైతం తాను చెప్పిన నాయకుడినే సర్పంచ్‌గా ఎంపిక చేయాలని హుకుం జారీ చేశాడు. అయితే.. ఈ విషయమై గ్రామానికి చెందిన మందపురి రమేశ్, వెంకన్న తదితరులు అభ్యంతరం తెలిపారు.
పంచాయతీలుగా విడిపోయినా ఆయన తలదూర్చడమేమిటని వారు నిలదీశారు. వీరికి గ్రామస్తులు సైతం మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం మద్యం మత్తులో నర్సింహాచార్యులు కొంతమందితో పోతిరెడ్డిపల్లికి వెళ్లి దుర్భాషలాడాడు. దీంతో స్థానికులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేశారు. సోమవారం గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కృష్టాపురం గ్రామస్తులు సైతం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో ఎక్కువగా టీఆర్‌ఎస్ నాయకులే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment