మంజుల, అజీద్
పోటీ ఏదైనా విజయం సాధించాలనుకోవడం మానవ నైజం. అయితే, ఊహించినట్టుగా పోరు ఏకపక్షంగా సాగి ఓ వ్యక్తిని విజయం వరించిందంటే పెద్దగా విశేషమేముంటుంది. కానీ, చివరివరకు పోరాడి ఒక్క మార్కు/పరుగు/ఓటుతో గెలుపు బావుటా ఎగురవేస్తే ఆ కిక్కే వేరు. ఉత్కంఠ రేపే ఇలాంటి ఫలితాలు అటు జనాలకు, ఇటు పోటీలో ఉన్నవారికి చిరకాలం గుర్తుండిపోతాయి. ఇక ఓడిన వారికి అతి స్వల్ప తేడాతో పరాజయం పాలవడం జీవితకాలం గుర్తుండిపోతుంది. తెలంగాణలో సోమవారం జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెండు చోట్ల అలాంటి ఫలితాలే వచ్చాయి. సిద్దిపేట జిల్లా అల్మాజీపూర్, నర్మేట గ్రామాల్లో ఒక్క ఓటు తేడాతో వంగ మంజుల, అజీద్ సర్పంచ్‌లుగా గెలుపొందారు.
సాక్షి, మిరుదొడ్డి /నంగునూరు (సిద్దిపేట): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్మాజీపూర్‌లో సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో వంగ మంజుల తన ప్రత్యర్థి బండారి పద్మపై ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్మాజీపూర్ కొత్తగా పంచాయతీ హోదా పొందిన గ్రామం కావడం విశేషం. అలాగే నంగునూరు మండలం నర్మేట గ్రామంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి అజీద్ ఒక్క ఓటు తేడాతో సమీప ప్రత్యర్థి శనిగరం బాబుపై గెలుపొందారు. తొలిసారి వెలువడిన ఫలితంలో 3 ఓట్ల తేడా రాగా.. రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్‌లో అజీద్ ఒక్క ఓటుతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment