‘ప్రణాళిక’లో సర్పంచ్‌లే కీలకం | sarpanch key role in planning | Sakshi
Sakshi News home page

‘ప్రణాళిక’లో సర్పంచ్‌లే కీలకం

Published Tue, Jul 22 2014 11:51 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

sarpanch key role in planning

 వికారాబాద్: ‘మనగ్రామం-మన ప్రణాళిక’లో సర్పంచ్‌లే కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లో ‘మన మండలం-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని  ఎంపీడీఓ కార్యాలయ సమావేశపు గదిలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ .. ఈనెల 30న జిల్లా ప్రణాళిక రూపొందుతోందన్నారు.

 ఇదివరకు ఉన్న పాలనలో వికారాబాద్, తాండూర్ ప్రాంతాలు చాలా వెనకబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలు కోరిన విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆయా శాఖల నుంచి ప్రాధాన్యతలను బట్టి గ్రామాలకు నిధులు వస్తాయన్నారు. స్థానికంగా ప్రజాప్రతినిధులు చెప్పిన  కార్యక్రమాలన్నీ చేపడతామని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని పేదలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

 జిల్లాకు మహర్దశ
 తెలంగాణలో రంగారెడ్డి జిల్లాయే అన్ని విధాలుగా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పెద్ద పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే రైతుల రుణమాఫీతో పాటు దళితుల వివాహాలకు రూ.50వేల ఆర్థిక సహాయం,  భూమిలేని దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తుందన్నారు. వికలాంగులకు దసరా నుంచి రూ.1500, వితంతువులు, వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్ ఇస్తుందన్నారు.

 వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతున్న తరుణంలో తాండూరు, పరిగి ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్ చుట్టూ 60 కి.మీల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా హార్టికల్చర్, కూరగాయల సాగును వృద్ధి చేస్తామని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి వీటి దిగుమతిని తగ్గిస్తామన్నారు. డ్వాక్రా భవనాల నిర్మాణం, అంగన్‌వాడీల నిర్మాణం చేపడుతామన్నారు.

 బస్సు సౌకర్యంలేని గ్రామాలను గుర్తించి బస్సులు మంజూరు చేయిస్తామన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ..   వికారాబాద్ ప్రాంతంలో ఉన్న చెరువుల మరమ్మతులు త్వరలోనే చేపట్టి రైతులకు వ్యవసాయానికి అవసరమైన నీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మండలంలో దళితులకు భూపంపిణీ చేసే విషయంలో మద్గుల్ చిట్టంపల్లిలో ఎంపిక చేశామన్నారు.

 పాఠశాలలకు రూ. 9కోట్ల నిధులు: కలెక్టర్
 జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మండలస్థాయి అధికారులను పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా నియమించి అభివృద్ధికి  కేటాయించే నిధులు సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  గ్రామానికి అవసరమైన వసతులు సమకూర్చే బాధ్యతను గ్రామసర్పం చులు తీసుకోవాలని  కోరారు. విద్యార్థులు ఇబ్బందుల పడ కుండా మౌలిక వసతుల కల్పనకు రూ.9కోట్లు మంజూరు చేశామన్నారు. సర్పంచులకు, యంపీటీసీలకు ప్రభుత్వ పథకాలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.

 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. సబ్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. రేషన్‌కార్డులో ఆధార్ అనుసంధానం పూర్తయితేనే అసలైనా లబ్ధిదారులను సులువుగా గుర్తించవచ్చన్నారు. పెన్షన్‌కోసం దరఖాస్తు చేసుకునే వారు రేషన్‌కార్డులో ఉన్న వయస్సును సరిచేసుకోవాలని, 65 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులన్నారు. రేషన్‌కార్డులో ఉన్న సవరణలను మీసేవ ద్వారా సరిచేసుకోవచ్చన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్తాహార్ షరీఫ్,ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, ప్రత్యేకాధికారి దివ్యజ్యోతి,  ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ గౌతం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement