గుండాల ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెబుతున్న సర్పంచ్ పుష్పకుమారి
చేవెళ్ల : బదిలీల ఆర్భాటంలో ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఇంటి దారి పడుతున్నారు. దీంతో గ్రామ సర్పంచే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇది చేవెళ్ల మండలంలోని గుండాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి. వివరాలోకి వెళ్తే... మండలంలోని గుండాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇక్కడ పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు మల్లమ్మ మాత్రమే ఉంది. గతేడాది ఒక ఉపాధ్యాయురాలు, విద్యావలంటీర్‌లతోనే పాఠశాలను కొనసాగించారు. ఈఏడాది ఇంకా విద్యావలంటీర్ల నియామకం జరగలేదు. దీంతో ఒకే ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉన్న ఆ ఒక్క ఉపాధ్యాయురాలు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో ఆమె కూడా రెండురోజులుగా పాఠశాలకు రావటం లేదు.
అయితే ఇదే పాఠశాలలో గ్రామానికి చెందిన సర్పంచ్ పుష్పకుమారిగణేశ్ ఇద్దరు పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో రోజూ ఉదయం సర్పంచే స్వయంగా తమ ఇద్దరి పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చి వదిలి వెళ్తోంది. ఈ సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయురాలు లేకపోవటంతో సర్పంచ్ పుష్పకుమారి విద్యార్థులకు టీచర్‌గా మారి పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాల పరిస్థితిని పట్టించుకోరా అంటూ ఆమె ప్రశ్నించారు.
మా పిల్లలు ఈ బడిలోనే ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలిసింది. లేదంటే పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చేదని అధికారుల తీరుపై ఆమె మండిపడుతున్నారు. గుండాలకు కేటాయించిన ఉపాధ్యాయురాలు రాకపోవటంతో పాఠశాల ఎలా కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలలు ఎలా నడవాలని అంటున్నారు.
రెండు మూడు రోజుల్లో సర్దుబాటు చేస్తాం
గుండాల ప్రాథమిక పాఠశాలకు మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో ఉన్న ఉపాధ్యాయురాలు బదిలీ కావటంతో కొత్తగా ఒక ఉపాధ్యాయురాలిని కేటాయించారు. అయితే అమె గుండాల దూరం అవుతుందని రాకపోవటంతో ఎవరూ లేక ఖాళీ అయ్యింది. విద్యావలంటీర్‌లకు నేటి నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు.
వీవీలను కేటాయిస్తాం. అప్పటి వరకు హైస్కూల్ నుంచి ఒక టీచర్‌ను ప్రాథమిక పాఠశాలకు కేటాయించి కొనసాగిస్తాం. రెండు మూడు రోజుల్లో అయితే మండలానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులతో ఎక్కువగా ఎక్కడైనా ఉంటే వారిని సర్దుబాటు చేయటానికి వీలవుతుంది.
- ఎంఈఓ సుజాత
Comments
Please login to add a commentAdd a comment