మరింత పదును...
Published Wed, Jan 27 2016 6:21 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
మంగళవారం నుంచే కొత్త చట్టం అమల్లోకి..
సాగు నీటి సౌకర్యం, అటవీ హక్కులను తిరస్కరించినా
ప్రాసిక్యూట్ చేసే అవకాశం
ఏర్పాటుకానున్న ప్రత్యేక కోర్టులు
చార్జిషీట్ ఫైల్ అయిన 2 నెలల్లో ట్రయల్ పూర్తి
జిల్లాలో పెండింగ్ కేసుల సంఖ్య 139
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1989 మరింత పదునెక్కింది. అణగారిన వర్గాలకు చెందిన దళితులు, గిరిజనులకు సమాజంలో సముచిత రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టంలో తాజాగా చేసిన సవరణలు అమల్లోకి వచ్చాయి. మంగళవారం నుంచి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ క చట్టం-2015 అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈ సవరణల ప్రకారం సమాజంలోని దళితులు, గిరిజనుల పట్ల ఎలాంటి వివక్ష చూపినా చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు సమాజంతోపాటు ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా వారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ చట్టం నొక్కి చెబుతోంది. ఈ చట్ట సవరణలను గత ఏడాది ఆగస్టు 4న లోక్‌సభలో, డిసెంబర్ 2న రాజ్యసభలో ఆమోదించిన విషయం తెలిసిందే.
కొత్త సవరణ ప్రతిపాదనలు ఇవే...
సవరించిన చట్టం ప్రకారం దళిత, గిరిజన వర్గాలకు ఎలాంటి అగౌరవం కలిగించినా కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి అత్యాచారాలు జరిపినా.. పకడ్బందీ విచారణ జరపనున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తుల జుత్తు లేదా గడ్డం అవమానకరంగా తొలగించినా, ఆ కోవలోనికి వచ్చే ఎలాంటి అగౌరవ ఘటనలకు పాల్పడినా.. ప్రాసిక్యూషన్‌కు అవకాశం కల్పిస్తోంది ఈ చట్టం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు చెప్పుల దండలు వేయడం, మనుషులు లేదా జంతువుల మృతదేహాలను మోసేందుకు ఆయా వర్గాల వ్యక్తులు వస్తే నిరాకరించడం, సమాధులు తవ్వకుండా అడ్డుకోవడం, ఆర్థిక లేదా సామాజిక బహిష్కరణలకు గురిచేయడం, వారి చేత మరుగుదొడ్లు కడిగించడం, ఎస్సీ, ఎస్టీ మహిళలను సామాజిక దురాచారమైన దేవదాసీలుగా సమాజానికి అంకితం చేయడం వంటి వాటిని కూడా నేరాలుగానే పరిగణించాలని చట్టం చెబుతోంది. దీంతో పాటు వారిని కులం పేరుతో దూషించడం, మంత్రగాళ్లన్న నెపంతో దాడులు చేయడం, ఎన్నికల సందర్భంలో ఆయా వర్గాల వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఎస్సీ, ఎస్టీ మహిళల ఒంటిపైనున్న ఆభరణాలు తొలగించడం, ఈ వర్గాలకు చెందిన వ్యక్తులను లేదా వ్యక్తిని ఇల్లు లేదా గ్రామం విడిచివెళ్లాలని ఒత్తిడి చేయడం, వారు పవిత్రంగా భావించే వస్తువులకు అగౌరవం కలిగించడం, మాటలతో నొప్పించడం వంటి చర్యలు కూడా నేరాల కిందకే వస్తాయి. అదే విధంగా సమాజంలో వారు సాఫీగా జీవించేందుకు కూడా ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా వర్గాలకు చెందిన సమూహాలు లేదా వ్యక్తులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు తిరస్కరిస్తే, అటవీ హక్కులు కల్పించే విషయంలో కూడా అన్యాయం జరిగితే ప్రాసిక్యూషన్ చేయవచ్చని చట్టం చెపుతోంది.
ప్రత్యేక కోర్టులు కూడా
తాజా సవరణలతో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న కోర్టులకు తోడు జిల్లా స్థాయిలో ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు తప్ప ఇతర కేసులు విచారించరు. దీంతో పాటు ఈ చట్టం కల్పిస్తోన్న మరో వెసులుబాటు ఏమిటంటే... ఫలానా కేసులో పోలీసులు చార్జిషీటు ఫైల్ చేసిన రెండు నెలల్లో ట్రయల్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో 139 పెండింగ్ కేసులు
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం పరిష్కరించాల్సిన కేసులకు జిల్లాలో త్వరగతిన మోక్షం లభించడం లేదు. పోలీస్, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడంతోపాటు కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ కేసుల పరిష్కారానికి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఉన్నప్పటికీ.. ఆ కోర్టులో చాలా కాలంగా రెగ్యులర్ న్యాయమూర్తి లేకపోవడంతో కేసులన్నీ పెండింగ్‌లో పడిపోతున్నాయని ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసినప్పటికీ అందులో మోటారు వాహనాల చట్టం కింద వచ్చే కేసులు, భూవివాదాలు తదితర కేసుల అదనపు బాధ్యతలను అప్పగించడం వల్ల ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయన్నది మరికొందరి వాదన. మొత్తంమీద జిల్లాలో నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీలు పెట్టిన 139 కేసులు విచారణ దశలో ఉన్నాయని పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజా సవరణల చట్టం ప్రకారం ఈ కేసుల విచారణకు ప్రత్యేక డీఎస్పీని నియమించాలి.
చిత్తశుద్ధి లోపించింది
దళిత, గిరిజనులకు రక్షణ కల్పించే చట్టాలు ఇప్పటికే అనేకం వచ్చాయి. చట్టాలను అమలు చేయాల్సిన యంత్రాగంలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన న్యాయం జరగడం లేదు. ఈ చట్టం అమలుకు కలెక్టర్, ఎస్పీ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఈ కేసుల్లో ఫిర్యాదు దారులకు కావాల్సిన రక్షణ, ఆర్థిక సహకారం అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ.. ఈ చట్టాన్ని అమలు చేయడంలో కనిపించకపోవడం దురదృష్టకరం.
- రవినాయక్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు (2012 నుంచి)
దహనం 01
గాయపర్చినవి 11
హత్య 04
ఇతర కేసులు 86
అవమానపర్చడం 12
అత్యాచారం 07
ఎస్సీ, ఎస్టీ కింద 18
మొత్తం 139
Advertisement
Advertisement