
నిర్భయ కేసులో సుప్రీం తీర్పును సమర్ధించిన నిర్భయ తల్లి ఆశాదేవి (ఫైల్ పోటో)
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్షను సమరిస్థూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. 2012 నిర్భయ సామూహిక లైంగిక దాడి, హత్య కేసుకు సంబంధించి దోషులకు ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్ధించడాన్ని ఆమె స్వాగతించారు. ‘మా పోరాటం ఇక్కడితో ఆగదు..న్యాయం జరగడంలో జాప్యం చోటుచేసుకుంది..న్యాయ ప్రక్రియలో జాప్యం సమాజంలో ఇతర కుమార్తెలపై ప్రభావం చూపుతున్న’దని ఆమె పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాలని తాను కోరుతున్నానని, దోషులకు ఉరిశిక్ష విధించి నిర్భయకు న్యాయం చేయడంతో పాటు ఇతర బాలికలు, మహిళలకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ రోజు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయవ్యవస్థపై తిరిగి విశ్వాసం నెలకొనేలా ఉందని స్వాగతించారు. ‘ నేరస్థులు చిన్నారులు కాదు..వారు ఇలాంటి నేరానికి పాల్పడటం దురదృష్టకరం..ఏమైనా సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని నిలిపిఉంచడంతో పాటు న్యాయం పొందుతామనే నమ్మకాన్ని పాదుకొల్పింద’ని ఆశాదేవి అన్నారు. మరణ శిక్షను సత్వరమే అమలుచేసి దోషులను ఉరితీయాలని నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ కోరారు.
రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తారని తనకు తెలుసని..అయితే తర్వాత ఏమిటని ఆయన ప్రశ్నించారు. న్యాయప్రక్రియలో చాలా జాప్యం చోటుచేసుకున్నదని, సమాజంలో మహిళలపై లైంగిక దాడులు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వీలైనంత త్వరలో ఉరిశిక్షను అమలు చేస్తే అంత మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు.
కాగా సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఇది విజయం సాధించిన క్షణమని నిర్భయ కుటుంబ న్యాయవాది రోహన్ మహజన్ అభివర్ణించారు. శిక్ష అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని తామిప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment