నీరవ్ మోదీ – పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం.. రొటొమ్యాక్ కొఠారి– బ్యాంక్ ఆఫ్ ఇండియా కుంభకోణం.. ఇలా రోజుకొక బ్యాంకు మోసాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం విదితమే. జిల్లాలోనూ ఈ తరహా బ్యాంకుకు సంబంధించిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపార లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో రుణం పొందిన ఓ రైస్‌మిల్లరు ఇప్పుడు చేతులెత్తేశాడు. ఆరు నెలలుగా తీసుకున్న రుణానికి సంబంధించిన అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ఓ రైస్‌మిల్లరు ఆంధ్రాబ్యాంక్ బోధన్ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.23 కోట్ల మేరకు రుణం తీసుకున్నారు. అయితే గత ఆరు నెలలుగా ఈ మొత్తాన్ని చెల్లించడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు ఈ రుణానికి సంబంధించిన సెక్యూరిటీ అసెట్స్ (ఆస్తుల)పై దృష్టి సారించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో బ్యాంకు రుణం తీసుకుని చేతులెత్తేసిన ఘటన ఇదే మొదటి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం జిల్లాలో కొత్తేమీ కాదు. రూ.ఆరు కోట్లు.., రూ.తొమ్మిది కోట్లు ఇలా పలువురు రైస్‌మిల్లర్లు, ఇతర కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు పొంది చేతులెత్తేశారు. కానీ ఇంత భారీ మొత్తంలో ఎగనామం పెట్టడం ఇదే తొలిసారి కావడంతో బ్యాంకు, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, రొటొమ్యాక్ కొఠారిలు వేల కోట్లలో బ్యాంకులకు ఎగనామం పెట్టగా.. జిల్లాకు చెందిన కొందరు రైస్‌మిల్లర్లు అప్పులిచ్చిన బ్యాంకులకు పంగనామాలు పెడుతున్నారు.బ్యాంకు నుంచి డబ్బుల ముఠా ఎత్తుకు పోతున్నట్లు సింబాలిక్ క్యారికేచర్‌ను వాడే విషయం పరిశీలించగలరు.
సెక్యూరిటీ ఆస్తుల విలువ అంతంతే..
భారీ మొత్తంలో రుణం పొందిన ఈ రైస్‌మిల్లరు సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువ రుణంలో సగం కూడా ఉండే అవకాశాలు లేకపోవడంతో బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. సుమారు రూ.23 కోట్ల మేరకు బకాయి పడగా.. సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లకు మించి ఉండదని తెలిసింది. రైస్‌మిల్లు స్థలం, ప్లాంట్, మిషనరీ, ఇతర ఆస్తులన్నీ కలిపినా ఈ మేరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం. దీంతో సుమారు రూ.పది కోట్ల రికవరీ పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అయితే సెక్యూరిటీగా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సర్‌ఫేసీ చట్టం ప్రకారం బ్యాంకుకు సంక్రమించిన అధికారాలతో సెక్యూరిటీ ఆస్తులను ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆస్తుల విలువ పెంచేసి..
రుణం పొందడానికి సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువను భారీగా పెంచినట్లు సమాచారం. మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం అధికంగా విలువ ఉన్నట్లు ఆస్తుల విలువను పెంచేసి.. భారీ మొత్తంలో రుణం పొందారు. ఈ వ్యవహారంలో వ్యాల్యువర్, బ్యాంకు ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ విలువైన ఆస్తులకు ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి బదిలీ అయినట్లు సమాచారం. ఆస్తి విలువను ఎక్కువగా చూపిన వ్యాల్యువర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
వివరాలు చెప్పడానికి లేదు..
బ్యాంకుకు ఎగనామం పెట్టిన విషయమై వివరాల కోసం నిజామాబాద్‌లోని ఆంధ్రాబ్యాంక్ రీజినల్ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.వి.వి.సత్యనారాయణను ‘సాక్షి’ సంప్రదించగా వివరాలు చెప్పేందుకు అంగీకరించలేదు. బ్యాంకు వివరాలు చెప్పడానికి లేదని దాటవేశారు. ఆస్తుల విలువను ఎక్కువగా చూపి ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసిన విషయం ప్రస్తావించగా.. రుణ మంజూరులో ప్రోసీజర్ ఫాలో అవుతామని చెప్పుకొచ్చారు. – పి.వి.వి.సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆంధ్రాబ్యాంక్
Comments
Please login to add a commentAdd a comment