పరీక్షను పర్యవేక్షిస్తున్న స్కావెంజర్ ముజ్జు
సాక్షి, బిచ్కుంద (జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగుపర్చి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బిచ్కుందలోని ఉర్దూ మీడియం హైస్కూల్‌లో మంగళవారం పదో తరగతి విద్యార్ధులకు విద్యా నైపుణ్యం పెంచడానికి నెలవారీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్వవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా ఉదయం 11గంటలైనా ఒక్క ఉపాధ్యాయుడు రాలేదు. దీంతో స్కావెంజర్ ముజ్జు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందించి పరీక్ష నిర్వహించారు. పాఠశాలలో ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు వీవీలు ఉండగా ఒక్కరు కూడా పాఠశాలకు రాకపోవడంతో స్కావెంజరే పరీక్ష నిర్వహించాడు.
దీనిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పాఠశాల మరుగుదొడ్లు, తరగతి గదులను స్కావెంజర్ శుభ్రం చేయాలి. నీటివసతి కల్పించాల్సి ఉంటుంది. కాని తమకు ఆలస్యమవుతుందని ఉపాధ్యాయులు ఫోన్ చేసి పరీక్ష ప్రశ్నపత్రాలు ఇచ్చి పరీక్ష నిర్వహించాలని ఆదేశించడంతో పరీక్ష నిర్వహించానని స్కావెంజర్ ముజ్జు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు కోసం ఎంఈవో కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ ఫిర్యాదు తీసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాకపోవడం స్కావెంజర్ పరీక్ష నిర్వహించడంపై ఎంఈవో రాములు నా యక్‌ను వివరణ కోరగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment