
పరిశీలన పడకేసింది..
- పూర్తికాని ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల పరిశీలన
- కళాశాలల వద్ద పెండింగ్‌లో
- 9.45 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఆదిలోనే చతికిలపడింది. ఈ పథకాల కింద దరఖా స్తులు స్వీకరించి రెండు నెలలు కావస్తున్నా పరిశీలన ప్రక్రియ తొలిదశకే పరిమితమైంది. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధిం చి రాష్ట్ర వ్యాప్తంగా 13,67,592 దరఖాస్తులు వచ్చాయి. దీంతో విద్యార్థులకు ఉపకారవే తనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లబ్ధి ఇప్పట్లో కష్టమని తెలుస్తోంది.
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ చివరనాటికి పూర్తి చేసి డిసెంబర్ కల్లా అర్హతలు నిర్ధారించాలి. కొత్త జిల్లాల ఏర్పాటు తో 2016–17కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో సమస్యలు తలెత్తాయి. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల నుంచి కుల, ఆదాయ పత్రాల జారీలో జాప్యం జరగడం తో విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే వెసు లుబాటు కల్పించింది. ఇలా దరఖాస్తుల స్వీక రణ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగింది.
ఇక కొత్త ఏడాదిలోనే...
ఈ విద్యాఏడాది మరో పక్షం రోజుల్లో ముగియనుంది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సు లు మినహా.. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటె క్నిక్ తదితర కోర్సులకు సంబంధించి వార్షిక పరీక్షలు ముగిశాయి. దీంతో ఆయా కాలేజీలకు వేసవి సెలవులు వచ్చేశాయి. విద్యార్థులు అందుబాటులో ఉన్న సమయంలోనే ఈ దరఖాస్తులు పరిశీలించాలి. కానీ అలా జరగ లేదు. దీంతో కాలేజీ యాజమాన్యాల వద్ద దాదాపు 9.45లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ మొదటివారంలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని కాలేజీ యాజమాన్యాలపై సంక్షేమ శాఖ అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. కాలేజీలకు సెలవులివ్వడంతో దరఖాస్తు పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో కొత్త విద్యాఏడాదిలోనే వీటి పరిశీలన పూర్తి చేస్తామని కళాశాల యాజమాన్యాలు అధికారులకు చెబుతున్నాయి.