దెబ్బతిన్న స్కూల్‌బస్సు వెనుక భాగం బస్సును ఢీకొని పక్కకు వెళ్లిన ట్యాంకర్
వర్ధన్నపేట (వరంగల్): విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును అతివేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సులోని 17మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ సంఘటన వర్ధన్నపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ట్యాంకర్ లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై ఉపేందర్‌రావు కథనం ప్రకారం... వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ అరబిందో ఉన్నత పాఠశాలకు చెందిన బస్సు సమీపంలోని డీసీతండా, బావనికుంట, నీలగిరి, గుబ్బెటితండాలో విద్యార్థులను 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై పెద్ద గుంతలు ఉండగా స్కూల్ బస్సు డ్రైవర్ బ్రేక్ వేసి వేగాన్ని తగ్గించాడు.
ఈ క్రమంలో వెనుక వేగంగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ లారీ డ్రైవర్ బ్రేక్ వేయకపోవడంతో స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న విద్యార్థుల తలలకు, కాళ్లకు గాయాలయ్యాయి. బస్సు అద్దాలు పగిలి విద్యార్థులకు గుచ్చుకున్నాయి. ట్యాంకర్ అదే వేగంతో కుడి వైపు రోడ్డు దిగి కిందికి 100 మీటర్ల దూరం వెళ్లింది. ఆ ప్రదేశంలో ఒక్కసారిగా విద్యార్థుల హాహాకారాలతో కొద్దిసేపు ఏం జరిగిందో తెలియ ని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ కరుణాసాగర్‌రెడ్డి, ఎస్సై ఉపేందర్‌రావు ప్ర మాదస్థలికి వచ్చి గాయాలపాలైన విద్యార్థులను వెంటనే ఆటోల్లో ఎక్కించి హుటాహుటిన వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ వద్దకు వెళ్లగా డ్రైవర్ రేకుల శ్రీనివాస్‌రెడ్డి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా 419గా రికార్డయ్యింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వెంట నే ఆస్పత్రికి తరలించారు. కాగా గాయాలపాలైన విద్యార్థినీ విద్యార్థులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆ స్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత వరంగల్ ఎం జీఎం ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు.
ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సపావట్ కృష్ణ (ఎనిమిదో తరగతి) కాళ్లు రెండు చోట్ల విరగడంతోపాటు తలకు గాయం కాగా వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతున్నాడు. ఎ.ఝాన్సీ (ఎల్‌కేజీ) తలకు గాయాలు కాగా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వి.మహేష్‌కు కాలు విరగ్గా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు వీరే..
బి.విజయ్ (ఐదో తరగతి), ఎస్.దివ్య (తొమ్మిదో తరగతి), ఎస్.చంద్రశేఖర్ (యూకేజీ), కె.కల్యాణి (తొమ్మిదో తరగతి), చరణ్ (ఒకటో తరగతి), రాహుల్ (యూకేజీ), బి.శ్రీరాం (ఒకటో తరగతి), భరత్ (మూడో తరగతి), బి.అరుణ్ (మూడో తరగతి), నిషాంత్ (ఎల్‌కేజీ), సంజన్ (ఒకటోతరగతి), బి.అశోక్ (మూడో తరగతి), బి.సాయివిద్య (నాలుగో తరగతి), సిరివల్లి (ఆరోతరగతి) ఉన్నారు.
ఉలిక్కిపడ్డ తండాలు..
స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైందనే విషయం ఆయా తండావాసులకు తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వ్యవసాయ పనుల్లో ఉన్న వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని తమ పిల్లలు ఎక్కడ ఉన్నారని బోరున రోదిస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తండాల్లో నుంచి వందలాది మంది తమ పిల్లలకు ఏమైందని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. స్వల్ప గాయాలైనట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
అధ్వానంగా జాతీయ రహదారి
వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి ఎన్‌హెచ్–563 పరిధిలోకి వచ్చిన తర్వాత అధ్వానంగా తయారైంది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతలను సైతం పూడ్చకపోవడంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కక్కిరాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుంచి డీసీతండా శివారు వరకు జాతీయ రహదారిపై ఉన్న పెద్ద పెద్ద గుంతల వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయినా సంబంధిత అధికారుల్లో చలనంలేదని ప్రజలు మండిపడుతున్నారు.
చిన్నారులందరూ క్షేమంస్వల్పగాయాలపాలైన 11 మందికిఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం
ఎంజీఎం: వర్ధన్నపేటలో మంగళవారం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిందని తెలిసి వర్ధన్నపేటలో ప్రమాద స్థలానికి పరుగులు పెట్టాం.. మా బిడ్డలను అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలిసి ఏం జరిగిందోనని ఆందోళన చెందాం.. కానీ చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడడం చూసీ అంతా.. దేవుడి దయ అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన 11 మంది..
వర్ధన్నపేట స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గాయాలైన విద్యార్థులు అంబోతు కళ్యాణి, భూక్య విజయ్, అంబోతు ఝాన్సీ, సపావతు చంద్రశేఖర్, సపావత్ భరత్, సభావత్ దివ్య, సపావత్ మహేష్, భూక్య శ్రీరామ, భూక్య చరణ్, భూక్య అరుణ్, రాహుల్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. విద్యార్థులు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా చికిత్సపొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్ పరామర్శించారు.
బస్సులో 40 మందిప్రయాణిస్తున్నం..
మా తండా నుంచి బస్సులో రోజూ 40 మంది వర్ధన్నపేట స్కూల్ వెళ్తం.. ఒక్కసారిగా వెనుక నుంచి ట్యాంకర్ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనతో అందరం భయభ్రాంతులకు గురయ్యాం. నా తలకు గాయమైంది.– కళ్యాణి, విద్యార్థిని
దేవుడి దయ వల్ల మా బిడ్డకు ఏం కాలేదు
బస్సును లారీ గుద్దిందని తెలియగానే తండా నుంచి పరుగులు పెట్టాం. అందరూ చచ్చిపోయారని చెప్పారు. ఆస్పత్రికి వచ్చి చూస్తే నా కొడుక్కు దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. – స్వరూప, బాలుడి తల్లి
Comments
Please login to add a commentAdd a comment