సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పాఠశాల విద్యాశాఖ వెనక్కి తగ్గింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులతో సహా ప్రాంతీయ సంయుక్త సంచాలకులను తప్పు దోవ పట్టిస్తూ హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ఉత్తర్వులు విడుదల చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు ఇందులో ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేల్చారు.
ఆ ముగ్గురు ఉద్యోగులైన సహాయ సంచాలకులు, సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగులు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనంతరం వారి నుంచి వివరణ తీసుకున్న ఆర్జేడీ ఆమేరకు ఫైలును పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయానికి పంపించారు. ఇక్కడి వరకు చర్యలు వేగవంతంగా జరిగినప్పటికీ...ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటువేసే క్రమంలో మాత్రం ఆ శాఖ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవకతవకలు జరిగిన తీరు, చర్యలు తీసుకోవాల్సిన విషయానికి సంబంధించిన ఫైలు విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయానికి చేరి 15 రోజులు కావస్తున్నా...ఆ ఫైలుకు మోక్షం కలగకపోవడం గమనార్హం.
ఉన్నతాధికారిపై ఒత్తిడి...
టీచర్ల బదిలీల్లో జరిగిన అక్రమాలు రుజువైనప్పటికీ...వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కలపై చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు ఆ శాఖలోని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి వస్తుండటంతోనే చర్యలకు సంబంధించిన ఫైలు పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు.
అవకతవకలకు పాల్పడినట్లు తేలిన ముగ్గుర్లో ఒకరు ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో రిటైర్మెంట్‌కు ముందుగా శాఖపరమైన చర్యలు తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు ఇబ్బంది వస్తుందని, ఈ కారణంగానే వేటువేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీ ఉత్తర్వుల్లో అక్రమంగా పేర్లు చొప్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను విద్యాశాఖ రద్దు చేసింది. మొత్తం 37 మంది టీచర్ల పేర్లతో వచ్చిన ఉత్తర్వుల్లో దాదాపు ఇరవై వరకు సరైనవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా టీచర్లకు తిరిగి బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అక్రమార్కులకు అండదండలు
Published Thu, Oct 25 2018 2:59 AM | Last Updated on Thu, Oct 25 2018 2:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment