
బీరు సీసాలో కనిపిస్తున్న తేలు అవశేషాలు
పరకాల: బీరు సీసాలో తేలు అవశేషాలు కనిపించిన ఘటన పరకాల పట్టణంలోని ఓ వైన్స్‌షాపులో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన మద్యం ప్రియులను కలవరానికి గురి చేసింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర వైన్స్‌లో రాకేష్ ఓ కంపెనీకి చెందిన లైట్ బీరు కొనుగోలు చేశాడు. సీసా నలుపు రంగులో ఉండటంతో సీసాలోని బీరు మొత్తం పూర్తయ్యేంత వరకు తేలు ఉన్న విషయాన్ని గమనించలేకపోయాడు.
బీరు సీసా అడుగు భాగంలో తేలు కనిపించడంతో విషయాన్ని వైన్స్ యాజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి ఆ యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాము ఏమైనా తయారు చేశామా అని షాపు యాజమాని అనటంతో కొద్ది సేపు మద్యం కొనుగోలు దారులతో గొడవ జరిగింది. తేలు అవశేషాలు ఉన్న బీరు త్రాగటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. ఘటనను పరకాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము విచారణ జరుపుతామని అధికారులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది. అసలే వేసవి కాలం..బీరు పట్ల ఎక్కువగా ఇష్టపడే మద్యం ప్రియులు బీరు సీసాలో తేలు రావడంతో అయోమయానికి గురయ్యారు.