సరుకు రవాణాలో ద.మ.రైల్వే ముందంజ
- రూ.7934.7 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రంగంలో దక్షిణమధ్య రైల్వే గతేడాది రికార్డును అధిగమించింది. ఈ ఏడాది మార్చి నాటికి 96.83 మిలియన్ టన్నుల సరుకు రవాణాపై రూ.7934.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 8.36 శాతం అదనంగా సరుకు రవాణా చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ తెలిపారు. శంకర్‌పల్లి, నర్సింగపల్లి, బనగానపల్లి, జన్‌పహాడ్, తాండూరులలో 6 సరుకు రవాణా టర్మినళ్లను అదనంగా ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెరిగినట్లు తెలిపారు.
ఈ ఏడాది కొత్తగా నాందేడ్ నుంచి ఉల్లి, జగిత్యాల నుంచి రంపపుపొట్టు, కాకినాడ నుంచి ఎరువులు, పశుగ్రాసం, ఏలూరు నుంచి కంటైనర్లు, చిత్తాపూర్ నుంచి సిమెంట్ రవాణా చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే రైళ్ల సగటు వేగం 20శాతం పెరగడం ద్వారా వ్యాగన్ ట్రిప్పులు కూడా పెరిగాయి. జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ రవాణా విభాగం అధికారులతో కలసి సమగ్ర ప్రణాళికలను రూపొందించడం వల్ల చక్కటి ఫలితాలను సాధించినట్లు పేర్కొన్నారు.