ఉత్తరాంధ్రకు ద.మ.రైల్వే ఉత్తచేయి.. పత్తాలేని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు | SCR Railway Does Not Run Sankranti Special Trains To Uttarandhra | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు ద.మ.రైల్వే ఉత్తచేయి.. పత్తాలేని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

Published Sat, Jan 7 2023 8:42 AM | Last Updated on Sat, Jan 7 2023 9:10 AM

SCR Railway Does Not Run Sankranti Special Trains To Uttarandhra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసలే పండుగ సీజన్‌.. జనం సొం­తూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ.. ఉత్త­రాం­ధ్రవాసులకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తచేయి చూపింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కనీసం ఒక్క ప్రత్యేక రైలూలేదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో విశాఖ మీదుగా ఒక్కటి కూడా వెళ్లడంలేదు. ఆరేడు రెగ్యులర్‌ రైళ్లు తప్ప ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. విశా­ఖ వైపుగా నడిచే రెగ్యులర్‌ రైళ్లన్నీ వచ్చే ఫిబ్రవరి వర­కు కూడా వెయిటింగ్‌ జాబితాతో దర్శన­మి­స్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు 30 రైళ్లను అదనంగా నడిపేందుకు చర్యలు చేపట్టింది. వాటిలో కాకినాడ, తిరుపతి, బెంగళూరు, విజయ­వాడ వంటి ప్రాంతాలకే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖ, చుట్టుపక్కలప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు లేవని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డుకు చెందిన వినయ్‌ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. 

సమన్వయలేమి...
దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేల మధ్య సమన్వయం కొరవడటం వల్లే ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి దువ్వాడ వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి కాగా, దువ్వాడ నుంచి విశాఖ తదితర ప్రాంతాలు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌లోకి వస్తాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లపై చూపిన శ్రద్ధ విశాఖ వైపు కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ‘హైదరాబాద్‌ నుంచి సామర్లకోట వరకు, అక్కడి నుంచి కాకినాడకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖకు వెళ్లాలంటే మరో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామర్లకోట నుంచి విశాఖకు వెళ్లడం ఎలా సాధ్యం’’అని ఫణీంద్ర అనే ప్రయాణికుడు చెప్పారు. రెగ్యులర్‌ రైళ్లు ఇప్పటికే భర్తీ కావడం, ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ, గంటల తరబడి కూర్చొని ప్రయాణంచేయడం మహిళలు, పిల్లలు, వయోధికులకు చాలా కష్టం. మరోవైపు బస్సుల కంటే రైళ్లలో చార్జీలు కూడా తక్కువ. 

పదిలక్షల మంది వరకు ప్రయాణం
ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సంక్రాంతి వేడుకలకు హైదరాబాద్‌ నుంచి 25 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. అందులో కనీసం 10 లక్షల మంది విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవాళ్లే ఉంటారని అంచనా. మరికొద్ది­రోజుల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటించనుండటంతో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement