బాత్రూంలో నీళ్లను టీ క్యాన్‌లోకి పట్టిన వ్యక్తి
సాక్షి, హైదరాబాద్ : రైలులో అమ్మే టీలో బాత్ రూం నీళ్లను కలిపిన వీడియోపై భారతీయ రైల్వే చర్యలకు ఉపక్రమించింది. బాత్‌రూం నీళ్లను టీ క్యాన్‌లో కలిపిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వస్తోన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. ఇద్దరు టీ అమ్మే వ్యక్తులు మూడు టీ క్యాన్‌లు తీసుకొని రైలులోని ఓ బోగీలోకి ఎక్కారు. ఒక వ్యక్తి ఆ మూడు క్యాన్‌లను టాయిలెట్‌లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బయట కాపలాగా నిలుచున్నాడు.
టీ క్యాన్‌లలో నీళ్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బోగీ తలుపు వద్ద నిలుచున్న ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఘటనను చిత్రీకరించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజులుగా వైరల్‌గా మారిన ఈ వీడియోపై రైల్వే శాఖ ఎట్టకేలకు స్పందించింది.
రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అధికారులు వీడియోలోని టీ అమ్మే వ్యక్తులను గుర్తించారు. సికింద్రాబాద్-ఖాజీపేట జంక్షన్ల మధ్య రైళ్లలో ఆహార విక్రయ కాంట్రాక్టును సొంతం చేసుకున్న పి.శివప్రసాద్ అనే కాంట్రాక్టర్‌కి చెందిన ఉద్యోగులే ఇందుకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో శివప్రసాద్‌కు దక్షిణ మధ్య రైల్వే లక్ష రూపాయల జరినామా విధించింది. శివప్రసాద్‌కు ఉన్న ఐఆర్‌సీటీసీ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment