వేర్వేరుగా పరీక్ష రాయనున్న కవలలు వీణావాణి | Scribes For Siamese Twins Veena Vani in Tenth Class Exams | Sakshi
Sakshi News home page

'టెన్‌'షన్‌!

Published Tue, Mar 10 2020 9:18 AM | Last Updated on Tue, Mar 10 2020 9:19 AM

Scribes For Siamese Twins Veena Vani in Tenth Class Exams - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల సమయం సమీపిస్తోంది. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను రెండు మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19 నుంచి జరగనున్న టెన్త్‌ వార్షిక పరీక్షలకు గ్రేటర్‌ పరిధిలో 1.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 761 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. ఎగ్జామ్స్‌ దగ్గర పడుతుండటంతో ఇటు విద్యార్థుల్లోనూ.. అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనిపిల్లలకు మానసికంగా ధైర్యం చెప్పి అండగా ఉండాలని సూచిస్తున్నారు.  

కోరితేవీణావాణీలకు స్క్రైబ్స్‌  
పుట్టుకతోనే రెండు తలలు అతుక్కునిజన్మించిన వీణావాణీలు 2016 వరకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడ వారు ప్రత్యేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుకోవడం తెలిసిందే. 2017 జనవరిలో వారిని స్టేట్‌హోంకు తరలించగా.. మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు 2018 విద్యా సంవత్సరంలో వీరికి వెంగళ్‌రావునగర్‌ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ కల్పించారు.  వీరికి వేర్వేరు అడ్మిషన్‌ నంబర్లు (5618, 5619) ఇచ్చారు. ఇటీవల వీరు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌టికెట్‌  ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకుని ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్‌ టికెట్లు అందజేసే అవకాశం ఉంది. వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం తక్కువ. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖప్రకటించింది.  

ఈసారైనా గట్టెక్కేనా?
హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 82 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7200 మంది వరకూ సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 47155 వేల మంది విద్యార్థులు ఉండగా,  17 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో 43139 వేలకుపైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, పది వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ)తో పరీక్షల తీరు మారింది. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన సిలబస్‌పై పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పట్టు సాధించలేకపోయారు. ఫలితంగా మ్యాథ్స్, సైన్స్‌ల్లో మూడేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గుతూ వస్తోంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లా పరువు నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. 

తల్లిదండ్రులూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
డిస్ట్రిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ద్వారా రూపొందించిన ప్రశ్నపత్రాలతో ఇప్పటికే అభ్యాస పరీక్షలు నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ మేరకు వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలి. వేళకు ఆహారం అందివ్వడంతో పాటు వేళకు నిద్ర పుచ్చడం, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేపి చదివించడం, చదువుకునే సమయంలో సాధ్యమైనంత వరకు టీవీ, సెల్‌ఫోన్‌ వంటివాటికి దూరంగా ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి వాదులాటకు దిగకూడదు. పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపే అంశాలను చర్చించరాదు. ప్రతికూల వాతావరణం పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది.     
– బి.వెంకటనర్సమ్మ, హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement