- జిల్లాలో జోరుగా వర్షాలు
- దడపుట్టిస్తున్న సీజనల్ వ్యాధులు
- అటకెక్కిన పారిశుధ్యం
- బల్దియాల్లో పొంచి ఉన్న రోగాల ముప్పు
- జాడలేని సమన్వయ కమిటీ సమావేశం
- కానరాని స్పెషల్ డ్రైవ్
- 'హరితహారం'లో అధికారులు నిమగ్నం
సాక్షి, మంచిర్యాల :
వర్షాలతో జిల్లా తడిసి ముద్దవుతోంది. సీజనల్ వ్యాధుల భయంతో పల్లెలు ఉలిక్కిపడుతున్నాయి. ఏ వ్యాధి ఎవరి ప్రాణాలు బలిగొంటుందోననే ఆందోళన ఏజెన్సీ ప్రాంత ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాఠశాలల్లో లోపించిన పారిశుధ్యంతో ఏ జబ్బు వస్తుందో తెలియడం లేదు. జిల్లాలోని మున్సిపాల్టీలతోపాటు వందలాది గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. పారిశుధ్యంపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. వర్షాకాలం ఆరంభానికి ముందే సీజనల్ వ్యాధులపై చర్చించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశం ఇప్పటికీ నిర్వహించలేదు. ఈ నెల 13 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జారీ చేసిన సర్క్యులర్ సైతం బుట్టదాఖలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం'పైనే అధికారులు దృష్టి సారించారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆ పథక పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయమై తూర్పు ప్రాంతానికి చెందిన ఓ పంచాయతీ విస్తరణ అధికారి(ఈవో పీఆర్డీ) స్పందిస్తూ.. వాస్తవానికి ఈ సీజన్‌లో కేవలం పారిశుధ్యంపైనే దృష్టి పెట్టాలి. కానీ ప్రభుత్వం హరితహారంపైనే దృష్టి పెట్టడంతో మేమంతా మొక్కలు నాటే ప్రదేశాలు.. మొక్కల గుర్తింపు.. రైతుల భాగస్వామ్యంపైనే దృష్టిపెట్టాం. సర్క్యులర్ ప్రకారం జరగాల్సిన పారిశుధ్య కార్యక్రమాలు జరగడం లేదు’ అన్నారు. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాలు అటకెక్కాయి. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.
610 గ్రామాలతోనే సరి..
క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్ల నివేదిక ఆధారంగా ఏటా 1200 గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. వీటిలో మలేరియా వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. కానీ 1200 గ్రామాలకు సరిపడా మలేరియా మందులు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో వ్యాధి తీవ్రతను బట్టి 610 గ్రామాలకు సరిపడా మందుల కోసం ప్రభుత్వానికి నివేదించారు. పారిశుధ్యం విషయానికొస్తే.. జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో సగానికి పైగా పంచాయతీల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. మూడు రోజుల కిత్రం కురిసిన వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లో రోడ్లు గుంతలమయమయ్యాయి. అందులో నీరు చేరి బురదగా మారింది. ఈగలు.. దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్డుపై వచ్చి చేరుతోంది. పారిశుధ్య పనులు కంటికి కానరావడం లేదు. ఇదే సమస్య పట్టణాల్లోనూ నెలకొంది.
జాడలేని నిధులు..
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద విలేజ్ హెల్త్ అండ్ సానిటేషన్ కోసం వర్షాకాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10వేల చొప్పున ఏటా రూ.86.60లక్షలు విడుదలవుతాయి. నిధులను ఏఎన్‌ఎం, గ్రామ కార్యదర్శి ఖాతాలో జమ చేస్తారు. వీటితో వర్షాకాలం రాకముందే.. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి. రహదారుల వెంట ఉన్న కలుపు(పిచ్చి)మొక్కలు తీయడం, డ్రెయినేజీల్లో పూడికతీత, బావులు, నీళ్ల ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలి. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల మందు అందుబాటులో ఉంచాలి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువలు తవ్వాలి. గత రెండేళ్ల నుంచి జిల్లాకు ఈ నిధులు రాలేదు. దీంతో సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు జరగడం లేదు. కొన్ని గ్రామాల్లో మాత్రమే 13వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్ వినియోగిస్తున్నారు.
సమన్వయ సమావేశమేదీ..?
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా పంచాయతీ అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్, డీఎంహెచ్‌వో, మత్స్యశాఖ డీడీ, కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ కమిషనర్లు, ఐసీడీఎస్ పీడీ, ఐకేపీ అధికారులతో సమావేశం నిర్వహించాలి. సమావేశంలో అన్ని శాఖల అధికారులు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తీసుకున్న చర్యలపై చర్చించాలి. తీసుకున్న నిర్ణయాలు.. బాధ్యతలు నిర్వర్తించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. కానీ సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించకపోవడంతో జిల్లాలో పారిశుధ్యం లోపించి.. ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.
పల్లెల్లో శానిటేషన్ జరగాలిలా...
జిల్లా పంచాయతీ అధికారి.. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై గ్రామ కార్యదర్శులకు స్పెషల్ డ్రైవ్ బాధ్యతను అప్పగించాలి. నీరు నిల్వ ఉన్న చోట దోమలు(లార్వా) వృద్ధి చెందే అవకాశాలు ఉండడంతో గుంతలు పూడ్చాలి. మురుగునీరు నిల్వ ఉండకుండా మోరీ ఏర్పాటు చేయాలి. తాగునీటిని క్లోరినేషన్ చేయాలి. ప్రాజెక్టుల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయాలి. కానీ చాలా పంచాయతీల్లో క్లోరినేషన్ జరగనే లేదు.
జిల్లాలో వ్యాధులు ప్రబలిన వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ర్యాపిడ్ యాక్షన్ టీంల ఏర్పాటు.. సరిపడా మాత్రలు, మందులు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత వైద్యారోగ్యశాఖది. ప్రస్తుతం ఈ శాఖ స్పందన బాగానే ఉంది.
పారిశుధ్యం, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘ సభ్యులకు బాధ్యతలు అప్పగించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇరువురి సేవలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటు జీవో 90 ప్రకారం ఒక గ్రామంలో.. ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు.. ఒక్కో ఆరోగ్య సిబ్బంది(ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ)కి ఒక గ్రామం కేటాయించాలి. ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాల్లో పర్యటించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై దృష్టి సారించాల్సిన బాధ్యత వైద్యశాఖదే.