ఖమ్మం వ్యవసాయం: వర్షాలకు తెల్లజాతి, గేదెజాతి పశువులతో పాటు మేకలు, గొర్రెలకు వచ్చే వ్యాధులు ఇలా ఉన్నాయి.
జబ్బవాపు..
ఈ వ్యాధి కలుషితమైన మేత మేయడం, నీరు తాగడం వల్ల సోకుతుంది. ఈ వ్యాధి బారిన పడకుండా పశువులకు ముందస్తుగానే టీకాలు వేయించాలి. ఒకవేళ వేయించకపోతే ఇప్పుడైన వేయిస్తే మంచిది.
అధిక జ్వరం, కుంటడం, సొంగ కార్చడం, జబ్బ వాయడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో వైద్యం చేయించకపోతే పశువులు 24 గంటల్లో చనిపోయే ప్రమాదం ఉంది.
కుందేటి వెర్రి..
ఈ వ్యాధి ఈగలు, దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దీని నివారణకు తరచుగా పాకలలో పొగ వేయాలి.
నల్లజాతి పశువులు (గేదెలు)
గొంతువాపు వ్యాధి (గురక)
ఈ వ్యాధి ఎక్కువగా ఐదు మాసాలు పైబడిన దూడలకు సోకుతుంది. కలుషితమైన నీరు తాగడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఈ వ్యాధికి కూడా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయించుకోవాలి. అలా వేయించని రైతులు వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి టీకాలు వేయించటం మంచిది.
వ్యాధి సోకిన పశువులు సొంగకారుస్తాయి. అధిక జ్వరం, మేత మేయకపోవడం, గొంతువాయడం, శ్వాస ఆడక చనిపోతాయి. వ్యాధి సోకిన 12 నుంచి 24 గంటల్లో పశువులు మరణించే అవకాశం ఉంది.
పొదుగువాపు
పాడి గేదెలు, ఆవుల్లో పొదుగువాపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణంలో పరిసరాలు, పాకలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఈ వ్యాధి సోకుతుంది. వెంటనే పశువైద్యాధికారిని సంప్రదిస్తే మంచిది.
మేకలు, గొర్రెలు... నీలి నాలుక వ్యాధి
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు గొర్రెలు, మేకలకు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుం ది. వ్యాధి సోకినవెంటనే తగిన చికిత్స చే యించకపోతే ప్రమాదం.
కాలుపుండు వ్యాధి
ప్రస్తుత తరుణంలో మేకలు, గొర్రెలకు కాలుపుండు వ్యాధి సోకే అవకాశం ఉంది. జీవాలు తడిప్రదేశాల్లో మేసేందుకు వెళ్తాయి కాబట్టి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకడం వల్ల కాళ్ల గిట్టల మధ్య పుండ్లు అవుతాయి. సరిగా నడవలేవు, మేత మేయవు. దీనివల్ల అవి బలహీనపడి మరణించే ప్రమాదం ఉంది.