పాముల కాలం.. జర భద్రం | Seasonal Snakes Special Story In Medak District | Sakshi
Sakshi News home page

పాముల కాలం.. జర భద్రం

Published Sun, Jul 19 2020 9:40 AM | Last Updated on Sun, Jul 19 2020 9:40 AM

Seasonal Snakes Special Story In Medak District - Sakshi

సాక్షి, జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): అసలే వానాకాలం ఆపై పాముల భయం.. వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామాల్లో, తండాల్లో మంత్రాలు చేసేవారిని, చెట్ల మందును నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వారు ఆస్పత్రికి రావాలని, మూఢ నమ్మకాలను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు.  జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ధాన్యపు గాదెలు, గడ్డివాములు మొదలైనవి ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి.

తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి మధ్యలో పాములు తేళ్లు ఉండే ప్రమాదముంది. కొన్ని ప్రాంతాల్లో పిడకలు దొంతరలుగా పేర్చి పెడతారు. వాటి మధ్య కూడా విష జంతువులు ఉండే ప్రమాదముంది. చేల గట్ల మీద నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కర్ర చప్పుల్లతో పాముకాటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

పాములన్నీ విషసర్పాలు కావు.. 
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది. అన్ని పాము కాట్లు ప్రమాద కరమైనవికావు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదం లేని మామూలు గాయాలే డ్రైబైట్స్‌ సాధారణ చికిత్స తీసుకుంటే ఈ గాయాలు నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్‌తోనే ప్రాణం మీది తెచ్చుకుంటారు.  

పాములు.. విష ప్రభావం 
కట్లపాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆసుప్రతిలో చేర్పించాలి. 
నాగుపాము: ఇది కాటేసిన కేవలం 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. 
రక్తపింజర: ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. 
జెర్రిపోతు, నీరుకట్ట: ఇది కాటేసినా విషం ఉండదు. అయితే కాటు వేసిన చోట చికిత్స చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఉత్తమం. 

పరిసరాల పరిశుభ్రత మేలు.. 
ఇళ్ల మధ్య ఎలాంటి చెత్త ముళ్ల పొదలు ఉంచరాదు. ఎందుకంటే పాములు ఎక్కువ శాతం పొదల మధ్యనే ఉంటాయి. అలాగే ఇళ్ల గోడల పక్కన కట్టెలు, ఏ వస్తువులు పెట్టుకోవద్దు. గోడల పక్కన ఏ వస్తువులైన పెడితే వాటి ద్వారా పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరం వెలుగులు ఉండే విధంగా చూసుకోవాలి. చీకట్లో బయటకు వెళ్లడం మంచిది కాదు. ఎక్కడికి వెళ్లిన పాదాలకు చెప్పులు తప్పనిసరిగా వేసుకోవాలి.  

మూఢ నమ్మకాల జోలికి వెళ్దొద్దు.. 
పాముకాటు గురైన వారు ఎట్టి పరిస్థితుల్లో అందోళన చెందవద్దు. అందోళన చెందితే గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక చర్యగా కాటు వేసిన భాగంలో కట్టు కట్టాలి. వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఏ పాము కాటు వేసిందో బాధితులు స్పష్టంగా చెప్పితే దానికి తగ్గ చికిత్స వైద్యులు అందిస్తారు. నాగుపాము కాటుకు గురైతే 15–20 నిమిషాల్లో ఆస్పత్రికి చేరాలి. లేనిచో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. పాముకాటుకు గురైన వారు మూఢ నమ్మకాల జోలికి వెళ్లవద్దు. కొందరు పాము కరువగానే కొన్ని రకాల ఆకు రసాలను పిండిపోస్తారు. అది మంచిది కాదు. మరికొందరు మంత్రాలను నమ్ముతారు. అవి ఏ మాత్రం పనిచేయవు. ఇలా చేస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుంది.   

అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో మందులు.. 
పాముకాటుకు గురైన వారికి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంటాయి. మండలంలోని రెండు పీహెచ్‌సీ కేంద్రాల్లో విరుగుడు యాంటి స్నేక్‌ వీనం ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఏ పాము కాటు వేసిందో చెబితే దానికి తగిన విరుగుడు ఇంజక్షన్‌ ఇస్తారు. 24 గంటల తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు.  

అప్రమత్తంగా ఉండాలి
పాము కాటుకు గురైన వారు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మండలంలోని జగదేవ్‌పూర్, తిగుల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాముకాటు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైన వారు వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రులను సంప్రదించి ఇంజక్షన్‌ వేయించుకోవాలి. పాముకాటుకు గురైన వారు ఎలాంటి నిర్లక్ష్యం చేసిన ప్రాణాలకే ముప్పు ఉంటుంది. పొలాల వద్దకు పోయేటప్పుడు గట్ల మధ్య చూసుకుంటూ ముందుకు వెళ్లాలి. – మహేష్, తిగుల్‌ పీహెచ్‌సీ వైద్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement