ఇదెంత న్యాయమో!
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డిపై పార్లమెంట్‌లో రెండోసారి అభిశంసన తీర్మానం తీసుకరావడానికి విఫలయత్నం జరిగినట్లు తెల్సింది. కొద్ది మంది రాజకీయ నాయకుల కారణంగా నాగార్జున రెడ్డి రుజువర్తన ప్రశ్నార్థకమవడం శోచనీయం. ఇది ఆయన ఒక్కరిని శంకించడం కాదు, సమస్త న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని శంకించడమే అవుతుంది.
ఓ న్యాయమూర్తిపై అభిశంస తీర్మానం తీసుకరావడం మామూలు విషయమూ కాదు, ఆషామాషీ వ్యవహారమూ కాదు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లోని ఉభయసభలు మూడింట రెండు వంతల మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఇంత వ్యవహారం అంత ఈజీ కాదని తెల్సినా అభిశంసన తీర్మానానికి, అందులో రెండోసారి కూడా ప్రయత్నించడమంటే బురద చల్లడం, ఆయన రాజ్యాంగ విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకే అన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. సమస్యకు తెరపడకుండా సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించడమే.
సస్పెండయిన ఓ దళిత జూనియర్ న్యాయమూరి ఓ కేసు విషయంలో తనపై ఒత్తిడి తెచ్చారంటూ, కింది కోర్టు సిబ్బందిని వేధిస్తున్నారంటూ, తనను దూషించారంటూ జస్టిస్ నాగార్జున రెడ్డిపై పెట్టిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ కూడా రెండోసారి అభిశంసన ప్రయత్నం జరగడం విచారకరం. ఈ వివాదానికి సంబంధించి 13- 02-2013లో నాగార్జున రెడ్డిపై ఫిర్యాదు చేశానని, దళిత జడ్జీ మొదట చెప్పడం, ఆ తర్వాత 18–02–2013లో 14–02–2013 తేదీలతో ఫిర్యాదులు చూపడం అంతా కట్టుకథ అని ఎప్పుడో తేలిపోయింది. 95 శాతం ఒళ్లు కాలిన వ్యక్తి నుంచి జస్టిస్ నాగార్జున రెడ్డి మరణ వాంగ్మూల తీసుకున్నట్లు కూడా సదరు జడ్జీ ఆరోపించారు. 95 శాతం కాలిన గాయాలతో ఎవరైనా స్పహలో ఉంటారా? అందుకు డాక్టర్ అంగీకరిస్తారా?
జస్టిస్ నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తొలిసారి ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని తప్పు తెలసుకొని రాజ్యసభ సభ్యులు గతేడాది డిసెంబర్‌లోనే వెనక్కి తీసుకున్నప్పుడు మళ్లీ రెండోసారి తీర్మానం ఇచ్చేందుకు ప్రయత్నం ఎందుకు జరిగిందన్నది ఇక్కడ ముఖ్య ప్రశ్న కాదా? కొంతమంది మాయ మాటలు నమ్మి పొరపాటు చేశామని నాడు 61 మంది సంతకాలు చేసిన తీర్మానాలను వెనక్కి తీసుకున్నారు. నాడు జస్టిస్ నాగార్జున రెడ్డికి మద్దతుగా ఆయన రుజువర్తన గురించి తెలియజేస్తూ ఏకంగా 1050 మంది న్యాయవాదులు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలు పంపించారు. ఆ తర్వాత జస్టిస్ రామకష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గత మార్చి నెలలో హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ మరోసారి అభిశంసనకు ప్రయత్నం జరిగిందంటే ఏమనుకోవాలి?
కొందరు విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటపోట్లను తేలిగ్గానే తీసుకోవచ్చు. అసలు పట్టించుకోకపోవచ్చు. న్యాయవ్యవస్థ స్వతంత్రను కోరుకునే జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వారు ఇలాంటి అంశాల పట్ల సున్నితంగా స్పందిస్తారు. ఈ న్యాయవ్యవస్థ స్వతంత్రను పార్లమెంట్ సభ్యుల సంఖ్యకు అప్పగిస్తే బాగుంటుందా? ప్రధాన న్యాయమూర్తి నియమించే జుడీషియల్ కమిటీ న్యాయ వ్యవస్థ స్వతంత్య్రను కాపాడుతుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ నైతిక విలువల పట్ల ఉన్న గౌరవంతోనైనా జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వాళ్లను విధులకు దూరంగా ఉంచడమంటే ఏమిటీ? ఇలాంటి అంశాల పట్ల అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్దం కాదు, వారు ఈ వ్యవస్థలో భాగమయ్యారేమో, ఇలాంటి వ్యవస్థకు న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదుకదా!