జన'ని'ల్‌ బజార్‌.. | Secunderabad General bazar Small Merchants Loss With COVID 19 | Sakshi
Sakshi News home page

జన'ని'ల్‌ బజార్‌..

Published Thu, Mar 19 2020 8:52 AM | Last Updated on Thu, Mar 19 2020 8:52 AM

Secunderabad General bazar Small Merchants Loss With COVID 19 - Sakshi

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని జనరల్‌ బజార్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ వందల కోట్ల వ్యాపారం సాగుతుంది. అయితే  కరోనా దెబ్బకు వ్యాపారం కుదేలైంది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వస్త్ర వ్యాపారాలకు పెట్టింది పేరు సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌. చేతి రుమాలు మొదలు వస్త్ర వ్యాపారాలు, స్టీల్, బంగారం అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో వస్త్రాలు వెళ్తుంటాయి. నిత్యం వేలమంది కస్టమర్లతో ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడేది.  ఇటువంటి జనరల్‌ బజార్‌కు కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ గట్టిగా పట్టుకుంది. వ్యాపారాలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయల టర్నోవర్‌ కూడా జరగడం లేదని వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ తమ వ్యాపారానికి ఇబ్బంది లేదని, చరిత్రలో మొదటిసారిగా పెద్ద మొత్తంలో నష్టం వచ్చి పడిందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర నష్టం వాటిల్లింది  
తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలకు వస్త్రాలను పంపిస్తుంటాం. వైరస్‌ నేపథ్యంలో ఎటువంటి ఎగుమతులు జరగడం లేదు. ప్రజలు కూడా కొనుగోలు చేసేందుకు జనరల్‌ బజార్‌కు రావడం లేదు. కోట్ల రూపాయల టర్నోవర్‌కు భారీగా గండి పడింది. దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.     – రవికుమార్, దుస్తుల వ్యాపారి

పది మంది కూడా రావడం లేదు 
ఎప్పుడూ జనసందోహంతో కిటకిటలాడే జనరల్‌ బజార్‌కు కరోనా మహమ్మారి పట్టుకుంది. నాకు కొన్నేళ్లుగా ఇక్కడ గోల్డ్‌ షాపు ఉంది. ప్రతిరోజు పది నుంచి 20 మంది కొనుగోలు దారులు కూడా రావడం లేదు. ఇది వరకు నిత్యం వందలాది మంది వచ్చేవారు. వైరస్‌ దెబ్బ జనరల్‌ బజార్‌పై పడింది.      – భవిలాల్‌ వర్మ, గోల్డ్‌ వ్యాపారి

పెళ్లిళ్ల సీజన్‌.. నో సేల్స్‌
పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నిత్యం వందల మంది కస్టమర్లతో షాపు కిక్కిరిపోయేది. ప్రస్తుతం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌తో ప్రజలు ఇక్కడికి రావడంలేదు. ఉదయం షాపు తెరిచింది మొదలు రాత్రి మూసివేసే వరకు గిరాకీ అనే మాటనే లేదు. ఇబ్బందిగా ఉంది.  – రామకృష్ణ, స్టీల్‌ వ్యాపారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement