నేలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్వయం సహాయక సంఘాలపై దయతలిచింది. మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి న సభ్యులపై పండగ పూట కరుణ చూపింది. జిల్లాలోని 24,780 స్వయం సహాయక సంఘాలకు రూ.56.27కోట్ల పావలా వడ్డీ రుణాలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐకేపీ సిబ్బంది నగదును పొదుపు ఖాతాల్లో జమచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే రుణాలను పొదుపు ఖాతాలో జమ చేస్తుండ డంపై కొందరు సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రూపులో అప్పులు ఉన్న వారి కి బ్యాంకు నిర్వాహకులు ఆ మొత్తంలో కోత విధించి.. మిగతాది చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో తమకు రుణం పూర్తిస్థాయిలో అందదని ఆ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఆనందం.. ఆవేదన..
వాస్తవానికి ప్రతి ఏడాది పావలా వడ్డీ రుణాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ.. 2015 నుంచి ఇప్పటివరకు వాటిని మంజూరు చేయలేదు. ప్రస్తుతం మూడేళ్ల రుణాలను ఒకేసారి విడుదల చేసింది. అది కూడా దసరా సమయంలో మంజూరు చేయడంతో సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగను ఘనంగా జరుపుకోవచ్చని ఆనందపడుతున్నారు. అయితే ఐకేపీ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో కొందరు సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన రుణాలను ఐకేపీ సిబ్బంది సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అప్పు తీసుకొని ఉన్న సభ్యులకు బ్యాంకు నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉండదు. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు పోను మిగిలిన మొత్తాన్ని సభ్యులకు అందజేస్తారు. దీంతో రుణాలను ఖాతాల్లో జమ చేయడం వల్ల తమకు ఎలాంటి లాభం ఉండబోదని, చెక్కు రూపంలో గానీ, నగదు రూపంలో గానీ అందజేయాలని అప్పు తీసుకున్న సంఘాల సభ్యులు
విజ్ఞప్తి చేస్తున్నారు.లక్ష్యానికి మించి..
స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాల మంజూరులో జిల్లా ఐకేపీ యంత్రాంగం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 8,267 సంఘాలకు గాను.. రూ.169.40కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. అధికారులు దానికి మించి మంజూరు చేశారు. సెప్టెంబర్ నాటికే రూ.179.07కోట్లను సంఘాలకు అందజేశారు. లింకేజీ రుణాల మంజూరుతోపాటు.. వసూళ్లలో కూడా జిల్లా యంత్రాంగం ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హం.
ఖాతాల్లో జమ అవుతున్నాయి..
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో అర్హత సాధించిన సంఘాలకు మంజూరైన రుణాలు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు సంబంధించిన పావలా వడ్డీ రుణాలను మంజూరు చేసింది. దసరా పండగ ముందు విడుదల కావడంతో సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. – ఆంజనేయులు, ఐకేపీ, డీపీఎం
నగదు ఇస్తే బాగుండేది..
పావలా వడ్డీ రుణాలను బ్యాంకు ఖాతాల్లో కాకుండా నేరుగా నగదు రూపంలో గానీ, చెక్కు రూపంలో గానీ ఇస్తే బాగుండేది. ఖాతాల్లో జమ చేయడం వల్ల బ్యాంకు వారు ఇదివరకు తీసుకున్న అప్పు కింద ఆ మొత్తాన్ని తీసుకుంటారు. అందుకే సభ్యులకు నగదు రూపంలో అందించే ఏర్పాట్లు చేయాలి. – బెల్లం లక్ష్మి, సంఘం సభ్యురాలు
సభ్యులు డ్రా చేసుకుంటున్నారు..
పావలా వడ్డీ రుణాలు సంఘాల వారి ఖాతాలో జమ అయ్యాయి. సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక్క నేలకొండపల్లిలోనే 150 సంఘాలకు పావలా వడ్డీ రుణాలు జమ అయ్యాయి. దసరా సమయంలో రుణాలు రావడం ఆనందంగా ఉంది. – ఆర్.పార్వతీబాయి, గ్రామ దీపిక, నేలకొండపల్లి
Comments
Please login to add a commentAdd a comment