గట్టుసింగారం జలపాతం
పెద్దపల్లిరూరల్: పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన గుట్టలు.. మధ్యలో నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసి ఆనందడోళికల్లో తేలియాడేందుకు వచ్చే యువత సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గట్టుసింగారం వద్ద జలపాతం ఉన్నట్లు ఆరేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి వర్షకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లా నుంచి కూడా పర్యాటకుల రాకపోకలతో సబ్బితం జలపాతం వద్ద సందడి నెలకొంటోంది. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై గల సబ్బితం గ్రామం నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి చేరుకోవడం పర్యాటకులకు పరీక్షగానే మారింది. వర్షాలు కురిసినపుడే జాలువారే జలపాతం అందాలను చూసేందుకు అక్కడికి చేరుకునేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మూడేళ్ల క్రితం జలపాతం వద్దకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానంటూ ఇచ్చిన హామీ అటకెక్కింది. వానలు కురిసినపుడు ఈ మట్టిరోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు పర్యాటకులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
15 మంది ప్రాణాలు పోయాయ్..
స్నేహితులతో కలిసి జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన యువత సరదాగా గడుపుతూ తమ స్మార్ట్‌ఫోన్లలో సెల్ఫీ దిగేందుకు యత్నిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ సారి వర్షం కురిసిన తొలి రోజుల్లోనే జలపాతం వద్ద ఆవుల యశ్వంత్ అనే యువకుడు సెల్ఫీ దిగేందుకు యత్నిస్తూ అదుపుతప్పి నీటిలో పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా గత ఆరేళ్లలో 15మంది ప్రాణాలు పోయాయి. జలపాతం వెలుగులోకి వచ్చిన మొదట్లో కొందరు యువకులు గుట్ట పై భాగానికి వెళ్లి బాహుబలి సినిమాలో వలె నటిస్తూ ఫొటోలు తీసుకోబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. సబ్బితం జలపాతం వద్ద మృత్యువాత పడ్డ వారంతా యువకులే.
రక్షణ ఏర్పాట్లేవి..!
గట్టుసింగారం జలపాతం జాలువారే పై భాగానికి వెళ్లి అక్కడనుంచి దూకినట్టు నటించబోయి అదుపుతప్పి కిందపడి మరణించిన సందర్భంలో రక్షణ ఏర్పాట్లు చేస్తామంటూ అటవీ శాఖ అధికారులు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే సరదాకోసం వచ్చిన యువకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనే వాదనలున్నాయి. జలపాతం ఉన్న ప్రాంతం అటవీశాఖ పరిధిలోనే ఉన్నా..జలపాతం వద్ద నీరు నిల్వ ఉండే ప్రాంతంలో ఉన్న ఇసుక నిల్వలను కొందరు అక్రమార్కులు తరలించుకుపోవడంతో ఆ ప్రాంతంలో లోతు ఎక్కువై ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి జలపాతం ఉన్న ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment