
కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటానన్నాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రాన్ని సాధించడం నుంచి ఇప్పటిదాకా దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేశాయని, అదే కాంగ్రెస్‌పార్టీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాహుల్‌గాంధీ 48వ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి, మిఠాయిలను పంచుకున్నారు.
దేశ భవిశ్యత్తు కాంగ్రెస్‌తోనే..
అనంతరం పొన్నాల మాట్లాడుతూ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి, దేశస్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ దేశం కోసమే ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. కొన్నిస్వార్థ రాజకీయ శక్తులు కాంగ్రెస్‌ది కుటుంబపాలన అంటూ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. దేశ ప్రధానమంత్రి పదవి కూడా అధిష్టించే అవకాశం ఉన్నా సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య వివరించారు. ఇలాంటి చరిత్రను దాచిపెట్టేవిధంగా మాట్లాడటం మంచిదికాదని హెచ్చరించారు.
కాపలా కుక్కలా ఉంటానన్నాడు..
1999లో మంత్రి పదవి రానందుకే కేసీఆర్ పార్టీ పెట్టారని లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఎన్నికల్లో గెలవడం కోసం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని పొన్నాల ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కూడా పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నారని చెప్పారు. దేశానికి భవిష్యత్తు నేతగా రాహుల్‌గాంధీ ఎదిగారని పొన్నాల అన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు.