స్కార్పియోను ఢీకొన్న లారీ
►ఇద్దరు నగరవాసుల మృతి
►వాహనంలో రెండు 0.22 దేశీయ ఆయుధాలు
►పది కిలోల జింక మాంసం స్వాధీనం
సంగారెడ్డి క్రైం : జిల్లాలోని మునిపల్లి మండలం కంకోల్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనంలో రెండు దేశీయ ఆయుధాలు, ఆరు బుల్లెట్లు, 15 కిలోల మాంసం లభించాయి. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం మేరకు.. హైదరాబాద్‌లోని ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ సయీద్‌ఖాన్ (39), అమాన్ సఫీయుల్లాఖాన్ (29), మెహిదీపట్నంకు చెందిన మహ్మద్ అనీసుల్లాఖాన్, అబ్దుల్ అజీజ్‌ఖాన్‌లు స్కార్పియో వాహనంలో జహీరాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు.
అయితే హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న లారీ మునిపల్లి మండలం కంకోల్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న స్కార్పియోను ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ సయీద్‌ఖాన్, అమాన్ సఫీయుల్లాఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను సదాశివపేట ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన మహ్మద్ అనీసుల్లాఖాన్, అబ్దుల్ అజీజ్‌ఖాన్‌ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది..
కలకలం సృష్టించిన రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి క్రైం : జిల్లాలోని మునిపల్లి మండలం కంకోల్ చౌరస్తా వద్ద బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నుంచి రెండు 0.22 దేశీయ ఆయుధాలు, వాడిన ఆరు రౌండ్ల బుల్లెట్లు లభించడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా స్కార్పియో వాహనంలో ఆయుధాలతో పాటు 15 కిలోల మాంసం లభించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ మాంసం జింకదే కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదానికి గురైన వారు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని బీదర్ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి వస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనంలో లభించిన ఆయుధాలు కేవలం జంతువులను చంపడానికి మాత్రమే వినియోగిస్తారని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో ఉంటున్న వీరు జంతువుల నుంచి ప్రమాదమేముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మాంసం నిర్దారణ కోసం పోలీసులు ల్యాబోరేటరీకి పంపారు. కాగా ప్రముఖ సినీ నటుడు సల్మాన్ ఖాన్ సైతం ఇదే తరహా కేసుపై అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరితో పాటు గాయపడిన ఇద్దరిపై కూడా క్రూర మృగాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ ఎం తిరుపతన్న తెలిపారు.