క్యాంపుల భారం తడిసిమోపెడు
చైర్మన్ పదవులకు రేసులో ఉన్న ఆశావహులు ఫలితాలు వెలువడిన వెంటనే మద్దతు దారులను కూడదీసుకుని వెళ్లారు. క్యాంపులు సుదీర్ఘంగా నిర్వహిం చాల్సి రావడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. అయి నాసరే ఫలితం ఉంటుందనే ధీమాతో చైర్మన్ అభ్యర్థుల్లో కనిపించడం లేదు.
ఫలితాలు వెలువడగానే రామగుండం కార్పొరేటర్లను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వేర్వేరుగా క్యాంపులకు తరలించాయి. గత నెల 14 నుంచి క్యాంపు నిర్వహించిన ఈ రెండు పార్టీలు మేయర్ ఎన్నికపై స్పష్టత లేకపోవడంతో ఈ నెల 20న ఇంటికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆరుగురు స్వతంత్రులతో పాటు తమ 19 మంది కార్పొరేటర్లతో క్యాంపు వేయగా, టీఆర్‌ఎస్ తొమ్మిది మంది స్వతంత్రులతో కలిపి తమ 14 మంది కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించింది. విశాఖపట్నం, తిరుపతి, ఊటీ తదితర ప్రాంతాలకు వెళ్లడంతో రెండు పార్టీలకు భాగానే ఖర్చయింది. రోజుకు కనీసం రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్చు కావడంతో ఒక్కో పార్టీకి ఇప్పటికే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో నోటిఫికేషన్ వచ్చాక మళ్లీ క్యాంపునకు వెళ్లొచ్చని తిరిగి వచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ముగ్గురు స్వతంత్రులతో టీఆర్‌ఎస్ క్యాంప్‌ను నిర్వహించింది. నోటిఫికేషన్ రాకపోవడంతో పదిరోజుల క్రితం వారంతా తిరిగి వచ్చారు. నోటిఫికేషన్ వచ్చాక క్యాంపుపై ఆలోచన చేయనున్నారు.
- హుస్నాబాద్ నగరపంచాయతీని దక్కించుకొనేందుకు టీఆర్‌ఎస్ ఈ నెల 21 పది మందితో క్యాంపునకు వెళ్లింది. ఇరవై రోజుల నుంచి కాంగ్రెస్ సహకారంతో ముగ్గురు స్వతంత్రులు ఇప్పటికే క్యాంపులో ఉన్నారు.
- హుజూరాబాద్ నగరపంచాయతీని సొంతం చేసుకోవడానికి టీఆర్‌ఎస్ క్యాంప్ వేసింది. పెద్దపల్లి నగరపంచాయతీపై కన్నేసిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు క్యాంపులకు వెళ్లాయి. టీడీపీతో కలిసి కాంగ్రెస్ శనివారం, స్వతంత్రులతో కలిసి టీఆర్‌ఎస్ ఆదివారం తమ కౌన్సిలర్లతో కలిసి క్యాంపులకు వెళ్లారు.
- సైదాపూర్ ఎంపీపీ కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు నెల రోజుల నుంచి క్యాంపు నిర్వహిస్తున్నాయి. తమకు మద్దతునిస్తున్న ఎంపీటీసీలతో కలిసి ఢిల్లీ, ఆగ్రా, ముంబయి తదితర ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లారు. ఒక్కో పార్టీ ఖర్చు ఇప్పటికే రూ.15 లక్షలు దాటింది. ముత్తారం, కమానపూర్ ఎంపీపీల కోసం పదిహేను రోజుల నుంచి క్యాంప్‌లు కొనసాగుతున్నాయి. ఊటీ, కొడెకైనాల్ తదితర విహారయాత్రల్లో ఎంపీటీసీలున్నారు.
- మండల పరిషత్ క్యాంపులకు రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చవుతుండగా, మున్సిపల్ క్యాంపులకు రూ.50 లక్షల వరకు వ్యయం కానుంది. నగరపాలక సంస్థల్లోనైతే పూర్తిస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తే కనీసం రూ.కోటి ఖర్చయ్యే అవకాశం ఉండటంతో లెక్కలు వేసుకున్న అభ్యర్థులు వెనుకడుగు వేశారు.