
ఇంటర్ బోర్డు వద్ద ధర్నా, ఉద్రిక్తత
హైదరాబాద్: ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. బుధవారం నగరంలోని తెలంగాణ ఇంటర్ విద్య కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ కళాశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయాలని నినాదాలు చేశారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వారి ఆందోళనతో అక్కడకు చేరుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని, వారిని చెల్లా చెదురు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరోవైపు ఉస్మానియా వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లించకుండా సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. మెస్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో 'చలో అసెంబ్లీ' చేపట్టిన విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. విశ్వవిద్యాలయాలకు వెంటనే వీసీలను నియమించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, వాహనాల్లో తరలించారు.